Annadata Sukhibhava Scheme: చంద్రబాబు వచ్చేశాడు.. మార్చేశాడు

ప్రతి రైతుకు సాగు పెట్టుబడి కింద ఏడాదికి 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా కింద రూ.13500 సాయం అందించేది.

Written By: Dharma, Updated On : June 26, 2024 11:34 am

Annadata Sukhibhava Scheme

Follow us on

Annadata Sukhibhava Scheme: ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టిన తర్వాత వరుస నిర్ణయాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల పేర్లు కూడా మార్చుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఐదు ఫైళ్లపై సంతకం చేశారు. వాటిని అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. తాజాగా వైయస్సార్ రైతు భరోసా పథకం పేరును.. అన్నదాత సుఖీభవగా మార్చారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి రైతుకు సాగు పెట్టుబడి కింద ఏడాదికి 20 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో వైసీపీ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా కింద రూ.13500 సాయం అందించేది. ఇందులో కేంద్రం అందించే పీఎం కిసాన్ రూ.6000లు కలిపి ఇచ్చేవారు. ఎన్నికల్లో తాము గెలిస్తే 20వేల రూపాయలు నగదు సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు దానికి సంబంధించి కార్యాచరణ ప్రారంభించారు. వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ గా మార్చారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్సైట్లో సైతం మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్ సైట్ లో సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు ఫోటోలను పొందుపరిచారు. వాస్తవానికి అన్నదాత సుఖీభవ పథకాన్ని 2019 ఎన్నికలకు ముందే చంద్రబాబు ఒకసారి అమలు చేశారు. ఇప్పుడు అదే పేరును పునరుద్ధరించడం విశేషం.

ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమైంది. వర్షాలు ఆశాజనకంగా పడటం లేదు. ఈ తరుణంలో రైతుల్లో ఒక రకమైన ఆందోళన నెలకొంది. మరోవైపు చంద్రబాబు ప్రకటించిన రూ.20,000 పెట్టుబడి సాయం ఎప్పుడు అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ పథకం పేరు మార్పుతో.. కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అమలు చేసిన కొన్ని పథకాల పేర్లు కూడా మారనున్నాయి. వైయస్సార్ సున్నా వడ్డీ పంటల రుణాల పేరిట ఉన్న పథకాన్ని వడ్డీ లేని రుణాలుగా మార్చనున్నారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని.. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గా మార్చారు. ఇప్పుడు వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ గా మార్చి.. ప్రజల ముందుకు తెచ్చారు.