CPS : ఏపీలో మూడు లక్షల మంది ఉద్యోగులు భగ్గముంటున్నారు. వారికి సీఎం జగన్ ఝలక్ ఇవ్వడమే అందుకు కారణం. గత ఎన్నికలకు ముందు.. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్ పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా హామీకి అతీగతీ లేదు. ఇప్పుడు కొత్తగా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తెరపైకి తెచ్చారు. దానినే కేబినెట్ లో ఆమోదించారు. సీపీఎస్ రద్దుగా ప్రచారం చేసుకుంటున్నారు. అటు అనుకూల మీడియా సైతం పెద్దఎత్తున ప్రచారం చేసుకుంటోంది. అయితే జీపీఎస్ తో సీపీఎస్ రద్దును అటకెక్కించడాన్ని 3 లక్షల మంది ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సీపీఎస్ స్థానంలో జీపీఎస్ ను తెచ్చి జగన్ సర్కారు తెలివితేటలను ప్రదర్శిస్తోంది. అయితే ఈ విషయం తెలియని మూర్ఖులు కాదు ఉద్యోగులు. ఇందులో ఉన్న మతలాబును ఇట్టే గుర్తిస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా బేసిక్‌పేలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాల్లో జమ చేయాలి. అంతేమొత్తాన్ని ప్రభుత్వ వాటాగా ఇవ్వాలి. సీపీఎస్ అంటేనే చందాతో కూడిన పెన్షన్. ఉద్యోగుల కంట్రిబ్యూషన్ ఆపకుండా సీపీఎస్ రద్దు ఎలా అవుతుంది? జీపీఎస్ ఎలా అమలు చేస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి పాత పెన్షన్ స్కీం ప్రకారం ఉద్యోగుల జీతంలో రూపాయి కూడా తీసుకోరు. అలా కాకుండా ఉద్యోగుల జీతంలో పది శాతం తీసుకుని ఏది అమలు చేసినా.. పేరు ఏది పెట్టినా అది సీపీఎస్ అవుతుందని ఉద్యోగులు వాదిస్తున్నారు.
నిజం చెప్పులేసుకొని బయలుదేరి వెళ్లేలోపే అబద్ధం ఊరంతా ప్రచారం చేసినట్టుంది. ఉద్యోగులకు జీపీఎస్ అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంది. ఆ వెంటనే సీపీఎస్ రద్దు అంటూ ప్రకటనలు ప్రారంభించారు. కూలీ మీడియా.. సోషల్ మీడియా సౌజన్యంతో సీపీఎస్ రద్దు చేసేశామని డప్పు కొట్టుకోవడం ప్రారంభించారు. అయితే వాస్తవాలు గ్రహించిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్దేశ్యాలను బయపెట్టారు. గణాంకాలతో సహ వెల్లడించారు. దీంతె ఇదొక ఎన్నికల స్టంట్ గా మారిపోయింది. సీపీఎస్ రద్దును అటకెక్కించిన జగన్ సర్కారు తీరుపై ఉద్యోగవర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.