Heavy Rains in AP : బంగాళాఖాతం నుంచి ఏపీకి తీవ్ర హెచ్చరికలు వస్తున్నాయి. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుండడంతో ఏపీ పై ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. మున్ముందు మరింత వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో..ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక జారీ అయ్యింది. ఇబ్బందికర పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. వాయుగుండం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ తో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం తో పాటు చిత్తూరు, కడప జిల్లాలకు మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు.
* వాయుగుండం గా మారి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. మంగళవారం సాయంత్రానికి వాయుగుండం గా మారింది. ఇది బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా వైపు కదులుతోంది. రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఆ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫలితంగా మెరుపు వరదలు సంభవించవచ్చని అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు పెరగడం ఖాయం. విజయవాడ అనుభవాల దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
* గత రెండు రోజులుగా కుంభవృష్టి
వాయుగుండం ప్రభావంతోనెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే కుండ పోత వర్షం పడుతూనే ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కావలిలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మరోవైపు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.కిందిస్థాయి సిబ్బంది ఎవరు సెలవులు పెట్టొద్దని.. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం యంత్రాంగాన్ని ఆదేశించింది.