Ex minister Balineni Srinivasa rao: మాజీ మంత్రి బాలినేని బాధపడుతున్నారా? అనవసరంగా పార్టీ మారానని భావిస్తున్నారా? తప్పు చేశానని లోలోపల కుమిలి పోతున్నారా? రాజకీయాల్లో ఉండడం వేస్ట్ అని ఒక అంచనాకు వచ్చారా? అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. ఆయన అనుచర వర్గం అలానే చెబుతోంది.కొద్ది రోజుల కిందట మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలో చేరారు. పార్టీలో చేరిన నాటి నుంచి పెద్దగా యాక్టివ్ గా లేరు. దీంతో ఆయన వేరే ఆలోచనతో ఉన్నారా? అని అనుమానం కలుగుతోంది. అనవసరంగా పార్టీ మారి తప్పు చేశానన్న బాధ ఆయన నుంచి వినిపిస్తుందన్న ప్రచారం జరుగుతోంది.వైసీపీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి.వైయస్ రాజశేఖర్ రెడ్డికి సమీప బంధువు కావడంతో కాంగ్రెస్ పార్టీలో సైతం మంచి గుర్తింపు లభించింది. రాజశేఖర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహించారు. రాజకీయంగా పట్టు సాధించగలిగారు బాలినేని. జనసేన ఆవిర్భావం నుంచి జగన్ వెంట అడుగులు వేశారు. జగన్ సైతం ఆయనకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.కానీ ఇప్పుడు అదే జగన్ వైఖరి నచ్చక జనసేనలో చేరారు బాలినేని.అయితే ఏదో అనుకుని చేరితే.. మరి ఏదో జరుగుతోంది అక్కడ. దీంతో కక్కలేక మింగలేని పరిస్థితిలో బాలినేని ఉన్నట్లు తెలుస్తోంది.
* మంత్రి పదవి తొలగించడంతో
గత కొంతకాలంగా వైసీపీ పై అసంతృప్తితో రగిలిపోయారు బాలినేని. జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టి పదవి తొలగించేసరికి తట్టుకోలేకపోయారు. నన్నే తొలగిస్తారా అని తీవ్ర ఆవేశానికి గురయ్యారు. అప్పటినుంచి పార్టీతో పాటు అధినేత జగన్ కంట్లో నలుసుగా మారారు. చివరకు తాను చెప్పినట్టే జగన్ నడుచుకోవాలని.. ప్రకాశం జిల్లా పెత్తనం అంత తనకే విడిచి పెట్టాలని షరతు పెట్టారు. జగన్ అంగీకరించకపోయేసరికి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆర్భాటంగా జనసేనలో చేరతానని భావించారు. కానీ కూటమి పార్టీల ఎఫెక్ట్ తో బాలినేనిని పవన్ వారించారు. ఒంటరిగా వచ్చి కండువా కప్పుకోవాలని సూచించడంతో అలానే చేశారు. కానీ జనసేనలో చేరాక బాలినేని చుక్కలు కనిపిస్తున్నాయి.
* గుర్తించని కూటమి నేతలు
ప్రస్తుతం బాలినేని విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ బాలినేని జనసేనలో ఎంట్రీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు జనసేనలో వర్గం కూడా బాలినేనిని వ్యతిరేకిస్తోంది. కనీసం కలుపు కెళ్ళే ప్రయత్నం కూడా చేయడం లేదు. అటు కూటమి పార్టీలు సైతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి ని పట్టించుకోవడం లేదు. కూటమి నేతలు వేస్తున్న ఏ ఫ్లెక్సీలో కూడా బాలినేని పేరు, ఫోటో కనిపించడం లేదు. గడ్డిపూచ మాదిరిగా తయారయ్యారు మాజీ మంత్రి బాలినేని.మరోవైపు ఏ పార్టీలో చేరిన బాలినేనిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని.. ఆయన అవినీతిని బయటకు తీస్తామని ఎమ్మెల్యే జనార్ధన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో బాలినేని కి కంటిమీద కునుకు లేకుండా పోతోంది. అనవసరంగా జనసేనలో చేరామా? అన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది.