Vijayawada : ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. జనసేన కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. టిడిపి తో అధికారం పంచుకుంటూనే.. సొంతంగా ఎదగాలని భావిస్తోంది. ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాలోని జనసేన గణనీయమైన ప్రభావం చూపుతూ వచ్చింది. ఇకనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. క్రమేపి విస్తరించాలని చూస్తోంది. అందుకే వైసీపీ నుంచి చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వంటి నేతలు క్యూ కట్టారు జనసేనలోకి. మరి కొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకొని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని పవన్ భావిస్తున్నారు. ఆయన డోర్లు తెరిచిన మరుక్షణం భారీగా నేతలు వైసీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు గోదావరి జిల్లాలతో పాటు విశాఖలోనే జనసేనకు బలం అధికంగా కనిపించింది. కానీ ఇప్పుడు ఉత్తరాంధ్రతో పాటు కోస్తా, రాయలసీమలోనూ బలం పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
* ద్వితీయ శ్రేణి క్యాడర్ పై ఫోకస్
వైసిపి ద్వితీయ శ్రేణి క్యాడర్ పై జనసేన దృష్టి పెట్టింది. పెద్ద నాయకుల కంటే దిగువ స్థాయి కేడర్ చేరితేనే పార్టీ బలపడుతుందన్నది పవన్ నమ్మకంగా తెలుస్తోంది. అందుకే స్థానిక సంస్థలతోపాటు కార్పొరేషన్లపై దృష్టి పెట్టింది జనసేన. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్ల నుంచి జనసేనలోకి చేరికలు జరుగుతున్నాయి. తాజాగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన నలుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరారు.పవన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వీరిలో 16 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి రాధిక, 38వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీరావు, 48 వ డివిజన్ కార్పొరేటర్ అత్తులురి ఆదిలక్ష్మి,51వ డివిజన్ కార్పొరేటర్ మరిపిల్ల రాజేష్ ఉన్నారు.
* జనసేనలోకి ఆ ముగ్గురు
అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏర్పడింది. విజయవాడలో ఇదివరకే ఈ నలుగురిలో ముగ్గురు కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ ఇప్పుడు అదే ముగ్గురు జనసేనలోకి యూటర్న్ తీసుకున్నారు.ఆదిలక్ష్మి,రాజేష్, అప్పాజీరావు గతంలో తెలుగుదేశం గూటికి వెళ్లారు. కానీ ఇప్పుడు మనసు మార్చుకొని జనసేనలోకి వచ్చారు. అయితే అది తెలుగుదేశం పార్టీ సమ్మతంతో నేనని తెలుస్తోంది. పార్టీని బలోపేతం చేయడం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు జనసేన నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రతి కార్పొరేషన్ లో జనసేన ప్రాతినిధ్యం పెరగాలని భావిస్తున్నారు. తద్వారా నగర నియోజకవర్గాల్లో జనసేనకు సీట్లు దక్కేలా ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే విజయవాడలో చేరింది వైసీపీ సభ్యులు. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళ్లారు. ఇప్పుడు అదే టిడిపి నుంచి జనసేనలోకి వచ్చారు. ఇదేంటి ఈ నయా రాజకీయం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.