Temperature
Temperature: ఈ ఏడాది ఎండలు దంచి కొట్టేలా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు( temperature) అమాంతం పెరిగాయి. వేసవి ప్రారంభంలోనే ప్రతాపం చూపుతున్నాయి. సంక్రాంతి తరువాత ఎండలు పెరుగుతూ వచ్చాయి. ఫిబ్రవరి రెండో వారానికి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. సాధారణం కంటే నాలుగు డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. అదే సమయంలో ఉత్తరాంధ్రతో పాటు మన్యంలో విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కురుస్తూనే ఉంది. ఇంకోవైపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు విపరీతమైన ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
* కర్నూలులో ఏకంగా 37.8 డిగ్రీలు
దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత మన రాష్ట్రంలోని కర్నూలులో ( Kurnool)నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా అక్కడ పగటి ఉష్ణోగ్రత 37.8 గా నమోదు కావడం విశేషం. బుధవారం ఒక్కసారిగా ఎండలు మండిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ కంటే నాలుగు డిగ్రీలు పెరిగాయి. కానీ కర్నూలు విషయంలో మాత్రం ఒకేసారి ఉష్ణోగ్రతలు భగ్గుమన్నాయి. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. ఫిబ్రవరి రెండో వారంలోనే ఇలా ఉంటే.. వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరించడంతో ప్రజల్లో ఒక రకమైన భయం వాతావరణం కనిపిస్తోంది.
* వాతావరణం లో విచిత్రం
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. ఉదయం 8 గంటల వరకు పొగ మంచు పడుతూనే ఉంది. అటు తరువాత సూర్యుడు(sun )ప్రతాపం చూపడం ప్రారంభిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు భానుడు భగభగతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. మరోవైపు శుభకార్యాల సీజన్ ప్రారంభం కావడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. శివరాత్రి నుంచి మరింత ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
* ఈ ఏడాది రికార్డు స్థాయిలో
ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఎండలు( heat ) ఉంటాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిస్తోంది. దశాబ్ద కాలం పాటు ఎండలు తీవ్రంగా ఉంటాయని.. 2015 నుంచి 2025 వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టమైన సూచనలు చేసింది. ఈ తరుణంలో ఈ ఏడాది ముందుగానే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతున్నాయి. మున్ముందు వేసవిలో ఏ పరిస్థితి ఉంటుందోనన్న ఆందోళన అందరిలో కనిపిస్తోంది.