CM Chandrababu : చంద్రబాబుకే ఎసరు పెట్టారా? ఆ కూలిన హెలిక్యాప్టర్ బాబుకేనా? వెలుగులోకి సంచలన నిజం*

సాధారణంగా సీఎం భద్రత అంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్వాయ్ వాహనాల నుంచి హెలికాప్టర్ వరకు అనువణువున క్షుణ్ణంగా పరిశీలించాలి. బాగున్నాయని నిర్ధారించిన తరువాతే వినియోగించాలి. అటువంటిది సీఎం చంద్రబాబు కోసం తెస్తున్న హెలిక్యాప్టర్ కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: Dharma, Updated On : August 27, 2024 10:47 am

helicopter crashed

Follow us on

CM Chandrababu :  మహారాష్ట్రలో కూలిపోయిన హెలికాప్టర్ ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెచ్చినదా?ముంబై నుంచి విజయవాడ తెస్తుండగా ప్రమాదం జరిగిందా? గత మూడు రోజులుగా ఇదే ప్రచారం జరిగింది. కానీ అంతా లైట్ తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కానీ.. ఏవియేషన్ అధికారులు కానీ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే టిడిపి అనుకూల మీడియాలో ప్రత్యేక కథనం రావడంతో..అది చంద్రబాబు కోసం తెచ్చిన హెలికాప్టర్ అని తేలింది. గత వైసిపి ప్రభుత్వం వినియోగించిన హెలిక్యాప్టర్ నే..ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. జగన్ వాడిన హెలిక్యాప్టర్ పైనే చంద్రబాబు తిరుగుతున్నారు. అయితే ప్రతి 1000 గంటలు ప్రయాణం తర్వాత హెలిక్యాప్టర్ సర్వీసు తప్పనిసరి. దీంతో చంద్రబాబు వినియోగిస్తున్న హెలిక్యాప్టర్ సర్వీస్ కోసం జిఎంఆర్ సంస్థ ముంబైకి పంపింది. అయితే ఈ సర్వీసు పూర్తయినంతవరకు.. ఆ హెలిక్యాప్టర్ స్థానంలో స్టాండ్ బైగా ముంబై నుంచి మరో హెలికాప్టర్ను పంపించారు. ఈనెల 24న ముంబై నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి.. అక్కడ నుంచి విజయవాడ తేవాలన్నది ఏవియేషన్ అధికారుల నిర్ణయం. అయితే ముంబైలో బయలుదేరిన ఆ హెలిక్యాప్టర్ పూణే జిల్లా పాడ్ గ్రామం వద్ద అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది. కానీ ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలిక్యాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసం కావడం విశేషం.

* ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యం
అయితే ఈ ఘటనతో ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరి బయటపడింది. జెడ్ ప్లస్ కేటగిరి రక్షణ ఉన్న ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడి భద్రత విషయంలో వ్యవహరించిన తీరు విమర్శలకు గురవుతోంది. సామర్థ్యం పరిశీలించకుండా, నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలిక్యాప్టర్ ను తెప్పించడం మొదటి తప్పు. సాధారణంగా సీఎం ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగించాలి. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనత విమర్శలకు తావిస్తోంది.

*:నిబంధనలకు విరుద్ధం
వాస్తవానికి 10 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీసు ఉన్న హెలిక్యాప్టర్ ను అద్దెకు తీసుకోకూడదన్న నిబంధన ఉంది. అంతేకాకుండా వాతావరణం సరిగా ఉందా? లేదా? అనే విషయంలో అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి గ్లోబల్ వెకాట్ర అనే సంస్థ నుంచి 2008 మోడల్ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. 16 సంవత్సరాల హెలిక్యాప్టర్ ను ఎంపిక చేసుకోవడం ఆందోళన కలిగించే విషయం. అందుకే అది తక్కువ ఎత్తులో నుంచి కిందకు పడి పూర్తిగా ధ్వంసం అయింది. కేవలం ఏవియేషన్ అధికారుల అవగాహన లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

* అనుభవ రాహిత్యం
ప్రస్తుతం ప్రోటోకాల్ తో పాటు ఏవియేషన్ ఎండిగా ఒకే అధికారి వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఎయిర్ ఫోర్సులో పని చేసే కల్నల్ ఈ బాధ్యతలు నిర్వర్తించేవారు. అప్పట్లో వాతావరణం లో ఏ మాత్రం తేడా ఉన్నా హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతించేవారు కాదు. హెలిక్యాప్టర్ ప్రమాదంలో వైయస్సార్ మరణం తర్వాత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఇలా నియమించిన అధికారులంతా అవగాహన లేని వారే అన్న విమర్శలు ఉన్నాయి. జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న సీఎం చంద్రబాబు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని టిడిపి నేతలు తప్పు పడుతున్నారు. ఏవియేషన్లో సీనియర్ అధికారులను నియమించాలని కోరుతున్నారు. అయితే మూడు రోజుల కిందటే హెలిక్యాప్టర్ కూలిపోయింది. అది చంద్రబాబు కోసం తీసుకున్న ప్రైవేటు హెలికాప్టర్ అని ప్రచారం చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ హెలిక్యాప్టర్ సర్వీసుకు ఇవ్వగా.. దాని స్థానంలో తెచ్చిన అద్దె హెలికాప్టర్ అని తెలియడం.. అది కూలిపోవడంతో.. ఏవియేషన్ అధికారుల చుట్టూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.