https://oktelugu.com/

MLC Kavitha: కవితకు బెయిల్ కోసం వేయికళ్లతో ఎదురుచూపులు.. రంగంలోకి ప్రముఖ న్యాయవాది.. సుప్రీంకోర్టులో ఏం జరుగనుంది?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్ట్‌ అయి ఐదు నెలలుగా జైల్లో ఉంటున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తనయ కల్వకుంట్ల కవిత. ఇప్పటి వరకు ఆమె చేసిన బెయిల్‌ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 27, 2024 / 10:43 AM IST

    MLC Kavitha

    Follow us on

    MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీని మార్చడం.. తద్వారా పరోక్షంగా లబ్ధి పొందినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా.. లబ్ధి పొందినట్లు ఢిల్లీ అటార్నీ జనరల్‌ గుర్తించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ చేపట్టింది. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ప్రాథమికంగా గుర్తించింది. దీంతో వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగింది. రెండు దర్యాప్తు సంస్థలు విచారణలో సంచలన విషయాలు, వీవీఐపీలు వెలుగులోకి వచ్చారు. పది మందికిపైగా అరెస్ట్‌ అయ్యారు. చివరగా తెలంగాణ మాజీ సీఎం కూతురు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఈ ఏడాది మార్చి 14న కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకు ముందు రెండుసార్లు ఈడీ విచారణకు హాజరైన కవిత.. తర్వాత విచారణ నుంచి మినహాయించాలని సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. కానీ విచారణ జరుగుతుండగానే ఈడీ కవితను అరెస్టు చేసింది. మార్చి 15వ తేదీ నుంచి ఆమె తిహార్‌ జైల్లో ఉంటున్నారు. ఇక కవిత రెగ్యులర్‌ బెయిల్‌ కోసం, మధ్యంతర బెయిల్‌ కోసం పలుమార్లు ప్రయత్నం చేశారు. రవూస్‌ అవెన్యూ కోర్టును, ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ దర్యాప్తు సంస్థలు బెయిల్‌ ఇవ్వొద్దని కోరడంతో న్యాయస్థానాలు దర్యాప్తు సస్థల వాదనలతో ఏకీభవించాయి. దీంతో చివరి ప్రయత్నంగా కవిత ఇటీవలే సుప్రీ కోర్టు తలుపు తట్టారు. మంగళవారం కవిత బెయిల్‌ పటిషన్‌పై విచారణ జరుగనుంది.

    ఆగస్టు 12న సుప్రీ కోర్టుకు..
    రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై జూలై 1న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ కవిత ఆగస్టు 12న సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు బీఆర్‌.గవాయ్, కేవీ.విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐ, ఈడీకి నోటీసులు జారీ చేసింది. సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేయకపోవడంతో విచారణ వాయిదా పడింది. మంగళవారం(ఆగస్టు 27న) విచారణ చేపట్టనుంది. సీబీఐ, ఈడీ వాదనలు వినిపించనున్నాయి. ఇప్పుడు రద్దయిన ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021–22 రూపకల్పన, అమలుకు సంబంధించిన నేరపూరిత కుట్రలో ప్రధాన కుట్రదారుల్లో ఆమె ప్రాథమికంగా ఒకరని పేర్కొంటూ, రెండు కేసుల్లోనూ కవిత బెయిల్‌ పిటిషన్‌లను హైకోర్టు ఇదివరలో కొట్టివేసింది. పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్‌కు సంబంధించి సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి.

    రంగంలోకి ముకుల్‌ రోహ్గతి..
    ఇక ఇప్పటి వరకు బెయిల్‌ కోసం రవూస్‌ అవెన్యూ, ఢిల్లీ హైకోర్టులో కవిత తరఫున పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. దర్యాప్తు సంస్థల తరఫున కూడా న్యాయవాదులు వాదనలు వినిపించారు. కానీ, దర్యాప్తు సంస్థల న్యాయవాదులే పైచేయి సాధించారు. దీంతో కవితకు బెయిల్‌ రాలేదు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో కవిత తరఫున వాదనలు వినిపించేందుకు మాజీ అటార్టీ జనరల్‌ ముకుల్‌ రోహ్గతిని కేటీఆర్, హరీశ్‌రావు రంగంలోకి దించారు. మంగళవారం ఆయన కవిత తరఫున వాదించనున్నారు. దీంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.