AP pensions : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అదే నెలలో భార్యకు పింఛన్ అందించనుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య అలా భర్తను కోల్పోయిన 5,402 మంది వితంతువులకు స్పోజ్ కేటగిరీలో పింఛన్లు అందించనున్నారు. అలాగే వివిధ కారణాలతో మూడు నెలల వ్యవధిలో పింఛన్ తీసుకోలేని 50 వేల మందికి ఈనెల 31న పింఛన్ అందిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈసారి ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ జరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల విషయంలో అన్ని అంశాలను సరళతరం చేసింది.
* మరింత సరళతరం
భర్తలు చనిపోతే భార్యలకు పింఛన్లు అందడం ప్రహసనంగా మారింది. దీనిని సరళతరం చేసింది కూటమి సర్కార్.అర్హులైన వారికి వేగంగా, ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా పింఛన్ తీసుకునే భర్త మరణిస్తే..అతని భార్యకు పింఛన్ అందించనున్నారు. గతంలో ఆరేడు నెలలు తర్వాత పింఛన్లు అందేవి. అయితే ఇలాంటి సమస్యలకు ఇక ఫుల్ స్టాప్ పెడుతూ.. భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఆనెలే పింఛన్ మంజూరు చేసే విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.స్పాజ్ కేటగిరి కింద వితంతువులకు ఎప్పటికప్పుడు పింఛన్ అందిస్తామని సీఎం చంద్రబాబు ఇదివరకే ప్రకటించారు.
* 31న పంపిణీ
నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు పింఛన్లు అందుకుంటున్న వారిలో 5,402 మంది చనిపోయారు. వారి భార్యలకు నాలుగు వేలు చొప్పున కొత్తగా పింఛన్ ను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరందరికీ డిసెంబర్ 31న పింఛన్ అందనుంది. అలాగే వివిధ కారణాలతో మూడు నెలలుగా పింఛన్ తీసుకోలేని 50 వేల మంది పింఛన్ దారులు కూడా.. ఈనెల 31న పెన్షన్ అందించనున్నారు. మరోవైపు ఈ నెల ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి ఒకటి సెలవు దినం కావడంతో.. సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించేందుకు సిద్ధపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం.