Kodali Naani : కొడాలి నాని ఏపీలో ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? ఆయన ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు?మునుపటిలా ఎందుకు విమర్శలు చేయడం లేదు? కనీసం వైసీపీ సమావేశాలు ఎందుకు పెట్టడం లేదు? ఏపీ పొలిటికల్ సర్కిల్లో కొడాలి నాని హాట్ టాపిక్ గా మారుతున్నారు. వైసిపి హయాంలో టిడిపి నేతల పై విరుచుకు పడడంలో కొడాలి నాని స్టైల్ వేరు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవారు.వారిపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేసేవారు. నాలుగుసార్లు గుడివాడ నుంచి గెలిచిన కొడాలి నాని.. ఐదోసారి కి వచ్చేసరికి మాత్రం చతికిల పడ్డారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వెనిగండ్ల రాము అనే ఎన్ఆర్ఐ అభ్యర్థిని చంద్రబాబు ఓడించారు. ఈసారి ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు ఓడకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు కొడాలి నాని. అదే విషయంపై తెలుగు యువత పెద్ద పోరాటమే చేసింది. ఫలితాలు వచ్చిన తర్వాత టిడిపి యువనేతలు కొడాలి నాని ఇంటిని చుట్టుముట్టారు. ఎప్పుడు రాజకీయ సన్యాసం చేస్తావు అంటూ ప్రశ్నించారు. కొడాలి నాని స్పందించకపోయేసరికి ఆయన ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు.ఒకటి రెండుసార్లు తప్ప కొడాలి నాని ఇప్పుడు బయటకు రావడం లేదు. అసలు ఆయన ఏపీలో కనిపించడం లేదు. హైదరాబాదులోనే ఎక్కువగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం ఆయన ఎక్కడున్నారో అన్న ఆచూకీ ప్రధాన అనుచరులకు తప్ప.. మరి ఎవరికీ తెలియడం లేదు. దీంతో వైసీపీలోనే ఒక రకమైన గందరగోళం నడుస్తోంది.
* విదేశాలకు వల్లభనేని వంశీ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణాజిల్లాకు చెందిన వల్లభనేని వంశీ మోహన్ పై దృష్టి పెట్టింది. ఆయనపై పాత కేసులను తిరగతోడింది. అరెస్టు చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఆయన విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం సాగుతోంది. గన్నవరంలో టిడిపి కార్యాలయం పై దాడి కేసులు ఆయన 71 వ నిందితుడిగా ఉన్నాడు. వైసీపీ కీలక నేతలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. వల్లభనేని వంశీ కోసం మూడు ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్ వెళ్లాయి. కానీ ఆయన అక్కడ చిక్కలేదు. ఆయన దేశంలో ఉంటే మాత్రం తప్పకుండా అరెస్టు చేస్తారు. కనీసం లుక్ ఔట్ నోటీసులు అందుకోకుండా ఆయన విదేశాలు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి కొడాలి నాని పై పడినట్లు సమాచారం.
*:గుడివాడలో టిడిపి యాక్టివ్
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన మరుక్షణం.. గుడివాడలో కొడాలి నాని అరాచకాలు ఇవి అంటూ టిడిపి శ్రేణులు ప్రచారం ప్రారంభించాయి. కొడాలి నాని అనుచరుల చేతుల్లో ఉన్న భూములను విడిపించి అసలైన యజమానులకు అందించే ప్రయత్నం చేసింది. అయితే ఈ కేసుల్లో కొడాలి నానిని అరెస్టు చేస్తారని ప్రచారం సాగింది. అందుకే ఆయన గుడివాడను విడిచి ఎక్కువగా హైదరాబాదులో ఉంటున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఆయన ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నది మాత్రం తెలియడం లేదు.
* ఎక్కడున్నారో తెలియదట
గత ఐదు సంవత్సరాలుగా కొడాలి నాని దర్జా వెలగబెట్టారు. ముఖ్యంగా వైసీపీ నేత జగన్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో నాని ఉండేవారు. కానీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత రెండు మూడు సార్లు మాత్రమే కనిపించారు. గుడివాడలో సైతం వైసీపీ కార్యాలయానికి రావడం లేదు. ఓటమిపై సమీక్షించలేదు. ఇప్పుడు అనుచరులకు తెలియకుండా హైదరాబాదులో గడుపుతున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ ఎపిసోడ్ పక్కకు వెళ్లడంతో.. నాని పై ఫోకస్ పెట్టారని సమాచారం. మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More