YCP strategy: ఏపీలో( Andhra Pradesh) వైయస్సార్ కాంగ్రెస్ వాయిస్ మారుతోంది. తమకు తాము బలం పెంచుకొని గెలుస్తామన్న ధీమా ఉంటే పర్వాలేదు. కానీ కూటమి మధ్య విభేదాలు వస్తాయని.. సామాజిక వర్గాల లెక్కలు మారుతాయని.. అందుకే ఒంటరిగా పోటీ చేసే తాము గెలుస్తామని లెక్కలు వేసుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇటువంటి లెక్కలు మూడుసార్లు వేసుకుంది ఆ పార్టీ. కానీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. అయితే ఇప్పుడు అదే ఫార్ములా తో 2029లో సైతం గెలుస్తామన్న ధీమాతో ఉంది. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందికరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా టిడిపి, జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ పెరుగుతోందని వైసీపీ చెబుతోంది. ఆ గ్యాప్ తమకు లాభమని అంచనా వేస్తోంది.
కాపు సామాజిక వర్గాన్ని తిప్పుకునేందుకు..
ప్రధానంగా ఈసారి కాపు సామాజిక వర్గం( Kapu community) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు టర్న్ అవుతుందని వైసిపి అంచనాగా ఉంది. అందుకే కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం, ఆవేదన పెంచే పనిలో పడింది. నందమూరి బాలకృష్ణ వైసిపి హయాంలో చిత్ర పరిశ్రమకు ఎదురైన పరిణామాల గురించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తనదైన శైలిలో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేశారు. అయితే చిరంజీవిని తెరపైకి తెచ్చి కాపు సామాజిక వర్గాన్ని, మెగా అభిమానుల ముసుగులో రాజకీయం చేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇంకోవైపు కందుకూరు లో ఓ హత్యను కాపు, కమ్మ సామాజిక వర్గ మధ్య జరిగిన ఆధిపత్య పోరుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కాపుల్లో ఒక రకమైన మార్పు కోసం ఈ ఘటనను సాకుగా చూపే సాహసం చేసింది. కానీ ఈ విషయంలో అనుకున్నంత సక్సెస్ కనిపించలేదు.
క్యాడర్ల మధ్య చీలిక వస్తుందని..
టిడిపి, జనసేన, బిజెపి నాయకత్వం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. ఆ మూడు పార్టీలు మరో 15 ఏళ్ల పాటు కలిసి వెళ్తాయని వారు బాహటంగానే చెప్పుకొస్తున్నారు. ఏకంగా రాయలసీమ వచ్చి ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని తేల్చి చెప్పారు. అందుకే ఇప్పుడు నాయకత్వంతో పని లేకుండా రెండు పార్టీల క్యాడర్ పై ఆశగా ఎదురుచూస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికలు సమీపిస్తున్న కొలది ఆ రెండు పార్టీల క్యాడర్ మధ్య గ్యాప్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. 2024 ఎన్నికలకు ముందు కూడా క్యాడర్లో ఇదేవిధంగా గ్యాప్ వస్తుందని అంచనా వేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ అటువంటిది ఏమీ లేకుండా పోయింది. రెండు పార్టీల మధ్య సమన్వయం సాగింది. టిడిపి తో జనసేన కలవడాన్ని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలమైన వాతావరణం ఉన్నవారు జనసేనను విడిచిపెట్టి వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. టిడిపి తో కలయిక ఇష్టం లేనివారు బయటకు వెళ్ళిపోవచ్చు అని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ఇదే విషయం చెబుతారు. కానీ ఎందుకో ప్రభుత్వ వైఫల్యాలపై కాకుండా.. ఆ రెండు పార్టీల క్యాడర్ మధ్య వచ్చే గ్యాప్ పై ఆశలు పెట్టుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.