Janasena : వారాహి యాత్రతో జనసేనలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎదురైన అవమానాలు, అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇంతవరకూ ఎన్నడూలేని విధంగా పవన్ ఇన్నిరోజులు జన క్షేత్రంలో ఉండడం ఇదే తొలిసారి. ఈ నెల 14న వారాహి యాత్ర అన్నవరంలో ప్రారంభమైంది. సత్యదేవుని సన్నిధిలో పూజలు చేసిన పవన్ వారాహి వాహనంపై అడుగుపెట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 11 నియోజకవర్గాల్లో యాత్ర సాగింది. దారిపొడవునా బహిరంగ సభలు, రోడ్ షోలను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.గతానికి భిన్నంగా అన్ని అంశాలపై సూటిగా మాట్లాడగలిగారు. కేడర్ లో ఉన్న అసంతృప్తులు,అనుమానాలను నివృత్తి చేయగలిగారు. జనసైనికులకు ఏది ఇష్టమో.. అదే మాట్లాడారు. ఆకట్టుకోగలిగారు.
జనసేన ఆవిర్భావం నాటికి పవన్ అభిమానులు మాత్రమే ఆ పార్టీలో కొనసాగారు. కానీ ఆ పార్టీ సుదీర్ఘ రాజకీయ పోరాటంతో అన్ని వర్గాల అభిమానాన్ని చూరగొంది. సినిమాలతో సంబంధం లేని వారు సైతం పవన్ ను అభిమానించడం ప్రారంభించారు. జనసేనను ఆదరిస్తున్నారు. అయితే పార్టీపై అభిమానమున్న చాలామంది తటస్థులు దూరంగా ఉండిపోయారు. అటు రాజకీయాలు, ఇటు సినిమా రంగం..ఇలా రెండు పడవలపై పవన్ అడుగుపెట్టడంతో చాలామంది ఆయన వెంట నడిచేందుకు ఆలోచించారు. తనకు పదవులతో పనిలేదని, సమస్యల పరిష్కారమే అజెండా అని ప్రకటించాక సుదీర్ఘ కాలం పనిచేసిన అభిమానులు పునరాలోచనలో పడ్డారు.
అయితే ఇప్పుడు వారాహి యాత్రలో ప్రత్యేక కార్యాచరణతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. జనసేనను మాత్రమే గెలిపించాలని.. సీఎంగా తనకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరుతుండడంతో అభిమానులు సైతం యాక్టివ్ అయ్యారు. మొన్నటివరకూ అలయెన్స్ తో ఎవరికో అధికారం కట్టబట్టేందుకే పవన్ అంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు పవన్ పవర్ షేరింగ్ పై ప్రకటనలు చేయడంతో అభిమానుల్లో సైతం సంతృప్తి కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు, జగన్ పాలన చూసిన తటస్థులు పవన్ కు ఒక చాన్సిద్దామని చూస్తున్నారు. నిజాయితీపరుడు కావడం, అవినీతి విషయంలో క్లీన్ ఇమేజ్ ఉండడంతో మెజార్టీ ప్రజలు మొగ్గుచూపుతున్నారు. ఒక విషయంలో చెప్పాలంటే వారాహి యాత్ర ముందూ తరువాత అన్నట్టు పవన్ పరిస్థితి ఉంది. ముఖ్యంగా జన సైనికుల్లో ఉరకలేసే ఉత్సాహం నెలకొంది.