CM Jagan: ఏపీ సీఎం జగన్ కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బస్సు యాత్రలో భాగంగా ఎక్కడికక్కడే బహిరంగ సభల్లో జగన్ మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ టిడిపి నేత వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఈవో ముఖేష్ కుమార్ మీనా సీఎం జగన్కు నోటీసులు ఇచ్చారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కే నోటీసులు జారీ కావడం సంచలనం రేకెత్తించింది.
అయితే ఒక్క జగన్ కే కాదు. చంద్రబాబు, అచ్చెనాయుడు, అయ్యన్నపాత్రుడు, జోగి రమేష్, లేళ్ల అప్పి రెడ్డి వంటి నేతలకు కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తమ ప్రసంగాల్లో ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళుతున్నాయి. స్పందిస్తున్న ఈసీ నోటీసులు జారీ చేస్తోంది. నేతల వివరణ కోరుతోంది. అందులో భాగంగానే ఏపీ సీఎం జగన్ కు ఈసీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ సీఎం జగన్ పై సైతం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వైసిపి నేతలు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. మార్చి 31 ఎమ్మిగనూరులో జరిగిన సభలో చంద్రబాబు సీఎం జగన్ పై వ్యక్తిగత కామెంట్స్ కు దిగారు. జగన్ ఉద్దేశిస్తూ రాక్షసుడు, జంతువు, దొంగ అంటూ సంబోధించారు. దీనిపై వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడం.. చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై జగన్ సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేయడం విశేషం. మొత్తానికైతే ఎన్నికల ముంగిట పరస్పర ఫిర్యాదులతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అవుతోంది. ఇప్పటికైనా నేతలు జాగ్రత్త పడతారో లేదో చూడాలి.