AP Elections 2024: వైసిపి ప్రభుత్వం మారిపోతుందని అధికారులు స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారా? ఆ పార్టీ అధికారంలోకి రాదని డిసైడ్ అయ్యారా? అందుకే మంత్రుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జూన్ 3 తర్వాత మంత్రుల కార్యాలయాలు ఖాళీ చేయాల్సిందేనని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలకు ఒక రోజు ముందు కార్యాలయాన్ని విడిచి పెట్టాలని.. ఆఫీసు నుంచి చిన్న వస్తువు కూడా తీసుకెళ్లవద్దని సాధారణ పరిపాలన శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అటు మంత్రుల వాహనాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సచివాలయ భద్రతను పర్యవేక్షించే ఎస్జిఎఫ్ ను ఆదేశించింది. దీంతో ఇది సంచలన అంశం గా మారింది. ఇప్పటికే వైసీపీకి ఓటమి తప్పదు అన్న సంకేతాలు నేపథ్యంలో.. సాధారణ పరిపాలన శాఖ తీసుకున్న నిర్ణయంతో మంత్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ ఎన్నికల సమయంలో సచివాలయం నుంచి కీలక ఫైళ్ళు బయటకు వెళ్లిపోయాయని ప్రచారం జరిగింది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. అధికార బిఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని అధికారులు భావించారు. అప్పట్లో అదే ప్రభుత్వం కొనసాగుతుందని అంచనా వేశారు. అందుకే మంత్రుల విషయంలో మినహాయింపు ఇచ్చారు. కానీ ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. అధికారుల అంచనాలు తప్పాయి. ఆ సమయంలోనే కీలక శాఖలకు సంబంధించి ఫైళ్లు మంత్రుల కార్యాలయాల నుంచి బయటకు వెళ్లిపోయాయని జోరుగా ప్రచారం సాగింది.తెలంగాణ అధికారుల చుట్టూ వివాదాల్లో కూడా నడిచాయి. ఇప్పుడు ఏపీలో అటువంటివి పునరావృతం కాకుండా ఇక్కడి అధికారులు ముందుగానే జాగ్రత్తపడ్డారు.
గత ఐదు సంవత్సరాలుగా అడ్డగోలు పాలన సాగింది. రోజుకో జీవో, పూటకో ఉత్తర్వు అన్నట్టు పరిస్థితి ఉండేది. పేరుకే మంత్రులు కానీ.. అందరూ డమ్మీలే. తమ సొంత శాఖలో తీసుకున్న నిర్ణయాలు సైతం తెలిసేవి కావు. నిర్ణయం తీసుకునేది సీఎం జగన్, ఆయన కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మాత్రమే. పేరుకే శాఖల మంత్రులు కానీ.. అన్ని రకాల డీల్స్ ఆ నలుగురే జరిపేవారు. మరోవైపు విధ్వంసాలు, ప్రభుత్వ భవనాలకు రంగులువంటి నిర్ణయాలు ఉండనే ఉన్నాయి.అటువంటి వాటికి ప్రత్యేక జీవోలు జారీచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధికారం మారిన మరుక్షణం ఈ తప్పిదాలన్నీ బయటపడనున్నాయి. అందుకే మంత్రుల కార్యాలయాల నుంచి ఫైళ్ళు జారుతాయని విపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాయి. అయితే జూన్ 3న కార్యాలయాలను ఖాళీ చేయాలని.. ఒక్క వస్తువు కూడా తీసుకెళ్లేందుకు అనుమతి లేదని సాధారణ పరిపాలన శాఖ స్పష్టం చేయడం పై మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టిడిపి కూటమి ఫిర్యాదుల మేరకేనని అనుమానిస్తున్నారు.