Krishna District TDP Controversy: కృష్ణాజిల్లాలో( Krishna district) టిడిపిలో తలెత్తిన వివాదం క్లైమాక్స్ కు చేరుకుంది. ఇద్దరు నేతల మధ్య జరిగిన వివాదం పెను ప్రకంపనలకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీనిపై టిడిపి హై కమాండ్ గట్టిగానే ఆదేశాలు ఇచ్చింది. క్రమశిక్షణ కమిటీ ఎదుట ఆ ఇద్దరు నేతలు తమ వాదనలు వినిపించారు. ఆధారాలు చూపించారు. క్రమశిక్షణ కమిటీ ఒక నివేదిక తయారు చేసి పార్టీ అధినేతకు పంపించింది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం చంద్రబాబు. గత కొద్ది రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నట్టు ఉండేది వ్యవహారం. పరస్పర ఆరోపణలతో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన కలకలం రేగింది. అయితే ఇద్దరి వివాదం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. అధినేత చంద్రబాబు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
* సంచలన ఆరోపణలు..
తిరువూరు ( thiruvuru ) నుంచి తొలిసారిగా గెలిచారు కొలికపూడి శ్రీనివాసరావు. కేశినేని చిన్ని సైతం తొలిసారిగా విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. అయితే అసెంబ్లీ టికెట్ కోసం తన వద్ద ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారని కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి. విజయవాడ పార్లమెంట్ స్థానం పరిధిలో ఉంటుంది తిరువూరు. 2014 నుంచి రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా గెలిచారు కేశినేని నాని. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. నాని టిడిపికి దూరమయ్యారు. దీంతో ప్రత్యామ్నాయంగా ఆయన సోదరుడు చిన్నిని ప్రోత్సహించింది టిడిపి నాయకత్వం. అయితే తాను పోటీ చేయాలంటే తన పార్లమెంట్ స్థానం పరిధిలో తిరువూరు కొలికపూడి శ్రీనివాసరావుకు ఇవ్వాలని చిన్ని హై కమాండ్ ను కోరినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా కొలికపూడి చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదిరింది. అయితే శ్రీనివాసరావుకు టికెట్ ఇప్పించిన చిన్ని ఇప్పుడు ఎందుకు ఆయనను విభేదిస్తున్నారు అన్న టాక్ నడిచింది.
* క్రమశిక్షణ కమిటీ ఎదుటకు..
అయితే ఈ వివాదం పెను ప్రకంపనలకు దారి తీయడంతో టిడిపి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరుకావాలని వారిద్దరికీ ఆదేశాలు వెళ్లాయి. అయితే కొలికపూడి శ్రీనివాసరావు తాను చేసిన ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలుస్తోంది. తిరువూరులో వచ్చే ఎన్నికల్లో తాను కాదని వేరే వ్యక్తి పోటీ చేస్తారని.. ఎంపీ కే సినేని చిన్ని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారని కొలికపూడి క్రమశిక్షణ కమిటీ ఎదుట చెప్పుకొచ్చారు. కానీ అందుకు తగ్గట్టు ఆధారాలు చూపలేకపోయారు. అదే సమయంలో ఎంపీ కేసినేని చిన్ని తాను మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని..హై కమాండ్ ఆదేశాల ప్రకారం మాత్రమే నడుచుకున్నానని చెబుతున్నారు. అటువంటి ఏవైనా ఉంటే హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న భరిస్తానని చెప్పారు. దీంతో క్రమశిక్షణ కమిటీ ఒక నివేదికను తయారుచేసి హై కమాండ్కు అందజేసింది.
* ఎమ్మెల్యే పైనే చర్యలు?
ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండు నెలలకే కొలికపూడి శ్రీనివాసరావు అనేక వివాదాలను తెచ్చుకున్నారు. చాలాసార్లు చంద్రబాబు పిలిచి మాట్లాడారు. సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా సరే ఆయన తీరులో మార్పు రావడం లేదు. ఆయన వ్యవహార శైలితో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే కొలికపూడి శ్రీనివాసరావు పై కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. చంద్రబాబు ఎలాంటి చర్యలకు దిగుతారో చూడాలి.