Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు? భీమవరం నుంచా? లేకుంటే గాజువాక నుంచా? అన్నది క్లారిటీ లేదు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై గత కొద్ది రోజులుగా ఎన్నో రకాల పుకార్లు వచ్చాయి. కానీ ఆయన తాజా చర్యల ద్వారా ఇప్పుడు కొత్త నియోజకవర్గమే అని తేలుతోంది. ఈసారి పవన్ పక్కాగా గెలుపొందాలని.. వైసీపీకి దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. చాలెంజింగ్ విన్నర్ గా నిలవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
గోదావరి జిల్లాలకు సంబంధించి ఇటీవల పార్టీ రివ్యూలను కాకినాడలో నిర్వహించారు. మూడు రోజులపాటు సాగిన ఈ రివ్యూలో కీలక చర్చలు జరిపారు. ఇప్పుడు మరో నాలుగు రోజులు పాటు కాకినాడలోనే పవన్ సమీక్షలు చేయనున్నారు. అంటే గత 15 రోజుల్లో.. ఎక్కువకాలం ఆయన కాకినాడలోనే గడిపారు. దీని వెనుక ఏదో ఒక మర్మం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాకినాడ అర్బన్ సీటు విషయంలో పవన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన ఎలాగైనా ఓడించాలని పవన్ భావిస్తున్నారు. వారాహి యాత్ర సమయంలో పవన్ భీషణ ప్రతిన చేసిన విషయం అందరికీ గుర్తుండిపోతుంది. ఎలాగైనా ఓడించి ఇంటికి పంపిస్తానని నేరుగా చంద్రశేఖర్ రెడ్డిని పవన్ హెచ్చరించారు. ఎవరో ఎందుకు నువ్వే పోటీ చేయవచ్చు కదా అని చంద్రశేఖర్ రెడ్డి తిరిగి సవాల్ చేశారు. అందుకే పవన్ ప్రత్యేకంగా కాకినాడ అర్బన్ నియోజకవర్గం పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా పవన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు అయ్యే వరకు కాకినాడలో తనకు ఒక ఇల్లు తీసి పెట్టాలని జనసేన శ్రేణులకు ఆదేశించినట్లు సమాచారం. కాకినాడ నగరం ప్లాన్ సిటీగా పేరు ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పైగా కాపు సామాజిక వర్గం అధికం. అందుకే పవన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. కాకినాడ అర్బన్ నుంచి పోటీ చేసి చంద్రశేఖర్ రెడ్డి ని ఓడిస్తే.. అధికార పక్షానికి చెక్ చెప్పినట్టు అవుతుందని.. చాలెంజింగ్ విన్నర్ గా నిలవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. దాదాపు కాకినాడ అర్బన్ సీటును పవన్ ఎంచుకున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. కాకినాడ లోక్ సభ స్థానాన్ని అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకోవచ్చని టిడిపి, జనసేన వర్గాలు భావిస్తున్నాయి. అయితే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గం విషయంలో పార్టీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని.. ఈ విషయంలో తొందరపాటు ప్రకటనలు వద్దని జనసేన వర్గాలకు హై కమాండ్ ఆదేశించినట్లు సమాచారం. అయితే సంక్రాంతికి ముందే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై ఒక క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.