BJP TDP Alliance: ఏపీలో పొత్తుల పై బిజెపి సీరియస్ గా ఆలోచిస్తోంది . నిన్నటి వరకు టిడిపి తో పొత్తు వద్దని భావించిన ఆ పార్టీకి అసలు తత్వం బోధపడుతోంది. ఒంటరిగా వెళ్తే శ్రేయస్కరం కాదని ఆ పార్టీలో బలమైన వాదన వినిపిస్తోంది. అందుకే వీలైనంత వరకు పొత్తులో సింహభాగం ప్రయోజనం పొందాలని భావిస్తోంది. సీట్ల పరంగా బేరానికి దిగినట్లు తెలుస్తోంది. 2014 కంటే ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎంపీ సీట్ల విషయంలో పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. ఒక విధంగా చెప్పాలంటే చావో రేవో లాంటివి. అందుకే ఆ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవసరాన్ని గుర్తించింది. గత ఎన్నికల్లో బిజెపితో ఉన్న స్నేహాన్ని వదులుకోవడం ద్వారా ఎదురైన పరాజయాన్ని గుర్తు చేసుకుంది. అందుకే చంద్రబాబు సైతం గత నాలుగు సంవత్సరాలుగా బిజెపి కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. ఏపీలో బిజెపికి అంతగా బలం లేకపోయినా.. ఎన్నికల్లో వ్యవస్థలను మేనేజ్ చేస్తారని బిజెపి సహకారాన్ని బలంగా కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు విషయంలో బిజెపి ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. కానీ ఇప్పుడు జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితులతో బిజెపి వైఖరిలో మార్పు వచ్చింది. కనీసం ఏపీ నుంచి పొత్తులో భాగంగా 5 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే.. సంఖ్యా బలం పెంచుకోవచ్చని ఆలోచన చేస్తోంది.
అయితే మొన్నటి వరకు క్షేత్రస్థాయిలో ఉన్న తమ బలానికి మించి ఆ పార్టీ నేతలు సీట్లు అడగడం విశేషం. 75 అసెంబ్లీ సీట్లతో పాటు 12 ఎంపీ స్థానాలు కావాలని ఆ మధ్యన బిజెపి నేత హర్షవర్ధన్ రెడ్డి ఓ టీవీ డిబేట్లో వ్యాఖ్యానించారు. అయితే ఏపీలో బిజెపికే అంత సీన్ లేదని.. వాస్తవాలు మాట్లాడాలని కామెంట్స్ వినిపించాయి. అయితే తాజాగా బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం నేపథ్యంలో.. ఏపీ బీజేపీ నేతల నుంచి హై కమాండ్ అభిప్రాయాలను సేకరించింది. వాస్తవ బలాన్ని గ్రహించి బిజెపి 5 లోక్ సభ స్థానాలతో పాటు తొమ్మిది అసెంబ్లీ స్థానాలను అడుగుతోందని వార్తలు వస్తున్నాయి. 2014లో 4 పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను టిడిపి కేటాయించింది. అయితే ఈసారి జనసేన సైతం పోటీ చేయనుండడంతో ఆ పార్టీకి సైతం కేటాయింపులు చేయాల్సి ఉంది. బిజెపికి అదనంగా ఒక లోక్ సభ స్థానాన్ని విడిచిపెట్టి.. అసెంబ్లీ స్థానాల విషయంలో మూడు తగ్గించాలని టిడిపి ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఒకవైపు బిజెపి నేతలు అభిప్రాయ సేకరణ, మరోవైపు టిడిపి పెట్టిన ప్రతిపాదనపై బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.