https://oktelugu.com/

 Kirankumar Reddy : బిజెపికి ఆశా’కిరణం’.. ఏపీ పగ్గాలు ఆయనకే!

గత ఐదేళ్ల కాలంలో ఏపీలో బిజెపికి కనీస ప్రాతినిధ్యం లేదు. కానీ ఈ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ముగ్గురు ఎంపీలు విజయం సాధించారు. ఇదే ఊపును కొనసాగించాలని బిజెపి హై కమాండ్ భావిస్తోంది.ఓ కీలక నేతకు పాలనా పగ్గాలు అందించాలని చూస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : September 12, 2024 10:41 am
     Kirankumar Reddy

     Kirankumar Reddy

    Follow us on

    Kirankumar Reddy :ఏపీ పై బీజేపీ ఫోకస్ పెట్టిందా? బలపడడానికి ఇదే సరైన సమయం అని భావిస్తోందా? ఒక సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేలా చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి కమ్మ, బీసీల మద్దతు ఉంది. జనసేనకు కాపు సామాజిక వర్గం అండగా నిలబడుతోంది. బిజెపి కి మాత్రం ఆ పరిస్థితి లేదు. అందుకే ఒక ప్రధాన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంట నడిచింది రెడ్డి సామాజిక వర్గం. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం జగన్ వైఖరి నచ్చక సైలెంట్ అయింది. ఇప్పుడు కూటమి గెలుపుతో టిడిపిలోకి వెళ్లలేక.. కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేక రెడ్డి సామాజిక వర్గం సతమతమవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వారికి ఆశాదీపంలా కనిపిస్తోంది. అందుకే రెడ్డి సామాజిక వర్గం నేతలు బిజెపి హై కమాండ్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.ఇదే సమయంలో బిజెపి వేరే ఆలోచన పెట్టుకుంది. ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

    * ఇప్పటివరకు నలుగురికి పగ్గాలు
    రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి నలుగురు బిజెపి అధ్యక్షులుగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవిని కంభంపాటి హరిబాబు దక్కించుకున్నారు. ఎక్కువ రోజులు పాటు అధ్యక్ష పదవిలో కొనసాగారు. అటు తరువాత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పదవిని చేపట్టారు. ఆయన తరువాత సోము వీర్రాజు ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు అధ్యక్ష పదవి చేపట్టిన నలుగురు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. ఇందులో ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కాగా.. ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇంతవరకు ఛాన్స్ దక్కలేదు. అందుకే ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు ఏపీ పగ్గాలు అప్పగించాలని హై కమాండ్ భావిస్తోంది.

    * తెరపైకి కిరణ్ కుమార్ రెడ్డి
    బిజెపి హై కమాండ్ అదే ఆలోచన చేస్తే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అధ్యక్ష పీఠం తప్పకుండా దక్కుతుందని తెలుస్తోంది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎం. అంతకుముందు అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. 2014 రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని విభేదించారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. బిజెపిలో చేరారు. ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేయడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బిజెపి హై కమాండ్ ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీ అధ్యక్షుల పేర్లు ఖరారు చేసే పనిలో హై కమాండ్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి పేరు దాదాపు ఖరారు చేసినట్లు.. ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది.

    * ఆ సామాజిక వర్గం యూ టర్న్
    కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నాయకులు వైసీపీలోకి వెళ్లారు.వైసిపి ఓడిపోవడంతో ఆ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.ముఖ్యంగా రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు డిఫెన్స్ లో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే.. వారంతా బిజెపిలోకి వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల నాటికి బిజెపిని పటిష్ట స్థితిలో ఉంచేందుకు కిరణ్ కుమార్ నియామకం దోహదపడుతుందని హై కమాండ్ భావిస్తోంది. అదే జరిగితే రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి పగ్గాలు వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.