AP Jobs News : కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్న క్రమంలో ఒక్కో హామీ అమలుకు ప్రయత్నిస్తోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సిద్ధమయింది. ఏపీపీఎస్సీ ద్వారా 2,686 ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభించింది. గతంలో భర్తీ చేయాల్సిన వాటితో పాటు ఇప్పుడు కొత్తవి కలిపి భర్తీ చేయనుంది. ఇప్పటికే జారీ చేసిన వాటిలో 1670 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా.. కొత్తగా 1,016 పోస్టులకు సైతం నియామకాలు చేపట్టనుంది. అందులో కీలకమైన 150 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి. యూనివర్సిటీలతో పాటు ఆర్జీయూకేటీల్లో మూడు వేలకు పైగా ఖాళీలను భర్తీ చేసే ఆలోచనలో ఉంది కూటమి సర్కార్. ఈ మొత్తం పోస్టులతో ఈ నెల 12న జాబ్ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలోని కీలక పైన పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
* 19 నోటిఫికేషన్ల ద్వారా..
మొత్తం 19 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది. వైసీపీ సర్కార్ కొన్ని రకాల నోటిఫికేషన్లు జారీచేసింది. కానీ వాటి ప్రక్రియను పూర్తి చేయలేకపోయింది. దీంతో కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడంతో పాటు పాత నోటిఫికేషనులు పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి సర్కార్ పై ఏర్పడింది. ప్రధానంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఏడు, ఇంటర్ విద్యలో లైబ్రేరియన్ సైన్స్ జూనియర్ లెక్చరర్ పోస్టులు రెండు, మునిసిపల్ అకౌంట్స్ సబర్డినేట్ సర్వీసెస్ పోస్టులు 11, అగ్రికల్చర్ ఆఫీసర్లు 10 పోస్టులు, హార్టికల్చర్ ఆఫీసర్ రెండు పోస్టులు, ఫిషరీస్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోస్టులు మూడు, గ్రౌండ్ వాటర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు నాలుగు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 100, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 256 బత్తి చేయాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణ తరువాత ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
* ముందుగా ఈ పోస్టుల భర్తీకి చర్యలు..
గత జూలైలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ అయింది. 987 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీపీఎస్సీ. మెయిన్స్ జరగాల్సిన గ్రూప్ 1 పోస్టులు 89, పాలిటెక్నికల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులు 99, ఇంటర్ విద్యలో జూనియర్ లెక్చరర్లు 47, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు 290 పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే జారీ అయిన నోటిఫికేషన్లను ఈ ఏడాది జూన్లోగా పూర్తి చేసే విధంగా ఏపీపీఎస్సీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గ్రూప్ టు మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23న జరుగుతుంది. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు మే నెలలో, జూనియర్, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు పరీక్షలు జూన్ లో నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ నాటికి ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో డీఎస్సీ పరీక్షల తేదీలు, ఏపీపీఎస్సీ పరీక్షలు ఒకేసారి జరగకుండా కసరత్తు జరుపుతున్నారు. మొత్తానికి అయితే ఏపీలో ఉద్యోగాల పండగ ప్రారంభం అయింది.