TTD Laddu Issue: జగన్ ఎందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు? ఆయన చెబుతున్నట్టు పోలీసులు నోటీసులు ఇచ్చారా? లేకుంటే డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్ భయపడ్డారా? లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకని భావించారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిన్న మధ్యాహ్నం వరకు జగన్ తిరుమల పర్యటన ఉంటుందని వైసీపీ శ్రేణులు హడావిడి చేశాయి. ఎప్పుడైతే టీటీడీ అధికారులు డిక్లరేషన్ ఇస్తేనే అన్న నిబంధన పెట్టారో.. అప్పుడే జగన్ పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. డిక్లరేషన్ అనేది ప్రాణ సంకటంగా మారిపోయిందని చెబుతున్నారు. నేను అన్య మతస్థుడిని అయినా.. తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉంది అని డిక్లరేషన్ పై సంతకం చేయాల్సి ఉంటుంది. దీనిపై సంతకం పెడితే తనకు తాను ఇబ్బందుల్లో పడినట్టేనని జగన్ కు తెలుసు. అందుకే ఆయన వెనక్కి తగ్గారని.. తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జగన్ ఆ డిక్లరేషన్ పై సంతకం చేస్తే రెండు కీలక విషయాలు బయట పడతాయి. ఒకటి తాను హిందువును కానని ఆయన స్వయంగా ఒప్పుకున్నట్లు అవుతుంది. నిజానికి ఇప్పటివరకు జగన్ చర్చలకు వెళ్లినా.. ప్రత్యేక ప్రార్థనలు చేసినా.. తనకు తాను క్రిస్టియన్ అని ప్రొజెక్ట్ చేసుకోలేదు. అలాగని హిందూ కాదని కూడా చెప్పలేదు. ఇలాంటి సమయంలో సంతకం చేస్తే తాను హిందువు కాదన్న విషయం స్వయంగా నిర్ధారించినట్లు అవుతుంది.
* ఓటు బ్యాంకుకు గండి
ఒకవేళ సంతకం చేస్తే బలమైన ఓటు బ్యాంకు వైసీపీకి దూరమయ్యే అవకాశం ఉంది. వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంకులో ఎస్సీ, ఎస్టీలు కీలకం. ఈ ఎన్నికల్లో అంత ఘోర పరాజయం ఎదురైనా.. 40 శాతం ఓటింగ్ రావడానికి అదే ప్రధాన కారణం. ఎస్సీ ఎస్టీలలో హిందువులతో పాటు క్రిస్టియన్లు కూడా ఉన్నారు. పొరపాటున సంతకం చేస్తేఆ వర్గాల్లో క్రిస్టియన్లు దూరమవుతారు.అదే సమయంలో తిరుమల వెళ్లి వెనక్కి తగ్గితే ఆ వర్గాల్లో హిందువులు హర్ట్ అవుతారు. ఇప్పటికే సాధారణ హిందువులు వైసిపికి దూరమయ్యారు. ఇప్పుడు డిక్లరేషన్ వివాదం ముదిరితే మిగతావారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.
* హిందూ సమాజంలో అనుమానం
లడ్డు వివాదం నేపథ్యంలో హిందూ సమాజంలో వైసిపి పై ఒక రకమైన అనుమానం ఉంది. ఇప్పటికే ఆ పార్టీ ఓడిపోయింది. పైకి లేచేందుకు నానా తండాలు పడుతోంది. ఇటువంటి సమయంలో లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటే పార్టీకి మరింత డ్యామేజ్ కాయం. సంతకం పెడితే ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు చేజారి పోతుందన్న భయం ఉంది. ఆ కారణంతోనే చివరి వరకు తిరుమల వస్తున్నట్లు చెప్పిన జగన్.. చివరి నిమిషంలో పర్యటనను రద్దు చేసుకున్నారు.
* తగ్గిన ఆదరణ
వైసీపీ ఆవిర్భావం నుంచి ఎస్సీ,ఎస్టీలు ఆ పార్టీకి ఆదరించారు. 2014లో టిడిపి గెలిచినా.. ఎస్సీ, ఎస్టి నియోజకవర్గాల్లో మాత్రం వైసిపి గెలిచింది. 2019 ఎన్నికల్లో మాత్రం దాదాపు ఈ నియోజకవర్గాల్లో క్లీన్ స్లీప్ చేసింది. కానీ 2024 ఎన్నికల నాటికి సీన్ మారింది. టిడిపి ఆవిర్భావం నుంచి గెలవని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో సైతం టిడిపి గెలిచింది. వైసిపి ఓడిపోయింది. అంటే వైసీపీ నుంచి ఎస్సీ ఎస్టీలు కొంత దూరమయ్యారని తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో డిక్లరేషన్ పై సంతకం పెట్టి.. సమస్యలు ఎందుకు కొని తెచ్చుకోవడం అని జగన్ భయపడినట్లు తేలింది.