Banks Merger: ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. అప్పట్లో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం సృష్టించింది.. ఇప్పుడిక మల్లి విడత విలీన ప్రక్రియకు కేంద్రం సిద్ధమవుతున్న తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలైన అంతరార్థం ఏంటనేది సామాన్యులకు అంతు పట్టకుండా ఉంది.
ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 వరకు ఉన్నాయి. వీటి సంఖ్యను నాలుగు వరకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా నాలుగు పెద్ద బ్యాంకులుగా మారుస్తామని చెబుతోంది.. ఇకపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా – యూనియన్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. మిగతా బ్యాంకులను వీటిలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంకు విలీనం
గతంలో యూనియన్ బ్యాంకులో ఆంధ్ర బ్యాంకు విలీనమైంది. ఇప్పుడు కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ విలీనం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటికింద ఇండియన్ బ్యాంకు, యూకో బ్యాంక్ లను తీసుకొస్తారని ప్రచారం జరుగుతుంది. తద్వారా ఏర్పాటయ్యే పెద్ద బ్యాంకు తోపాటు, వచ్చే రోజుల్లో కేవలం ఎస్బిఐ, పిఎన్బి, బి ఓ బి లను మాత్రమే కొనసాగించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఇతర మధ్య తరహా ప్రభుత్వ రంగ బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఎస్బిఐ, పిఎన్బి, బి ఓ బి లో విలీనం చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పంజాబ్ అండ్ సింధు బ్యాంకుపై ఇప్పటివరకు కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఇప్పటికైతే విలీనం గురించి చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి ఆమోదం కోసం ఫైల్ పంపించిన తర్వాత.. అక్కడి నుంచి అనుమతి అనేది లభించిన తర్వాత.. క్యాబినెట్ సెక్రటేరియట్ లో ఉన్నతాధికారుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఆ తర్వాత ప్రధాన కార్యాలయం వరకు పంపిస్తారు. మార్కెట్లను నియంత్రించే సెబీ పరిశీలనకు కూడా ఈ ఫైల్ వెళ్తుంది. ఇవన్నీ ఓకే అయితే వచ్చే ఏడాది విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి విడత విలీన ప్రక్రియలో 27 నుంచి 12 వరకు బ్యాంకుల సంఖ్యను తగ్గించారు. బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేయడం.. కార్యాలయాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం.. అంతర్జాతీయంగా పోటీని పెంచడం వంటి వాటి ద్వారా బ్యాంకుల విలీన ప్రతిపాదనను ఆర్థిక శాఖ రూపొందించినట్లు తెలుస్తోంది.. పెద్ద బ్యాంకులుగా ఏర్పాటు చేయడం వల్ల ఖాతాదారుల్లో కూడా విశ్వసనీయత పెరుగుతుందని ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు.