Amaravathi Capital : అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వానికి అన్ని శుభపరిణామాలే ఎదురవుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. కొద్దిరోజుల వ్యవధిలో అమరావతి యధాస్థితికి చేరుకోనుంది. అటు అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాలకు సంబంధించి నిపుణులు కీలక ప్రతిపాదనలు చేశారు.మరోవైపు ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్డులను శరవేగంగా నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. భూ సేకరణ నుంచి నిర్మాణమంతా కేంద్రమే భరించనుంది. మరోవైపు అమరావతి రాజధాని నగరాన్ని కలుపుతూ కొత్త రైల్వే లైన్ల నిర్మాణం సైతం జరగనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా శరవేగంగా అడుగులు పడుతుండగానే.. మరోవైపు నిధుల సమీకరణకు సంబంధించి ప్రక్రియ కూడా వేగవంతం అయ్యింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు ఇప్పించింది. ఇప్పటికే ఒకసారి ప్రపంచ బ్యాంకు బృందం ప్రతినిధులు అమరావతిని సందర్శించారు. సీఎం చంద్రబాబుతో కీలక చర్చలు జరిపారు. తాజాగా మరోసారి ప్రపంచ బ్యాంకు తోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు చంద్రబాబును కలవనున్నారు. వారం రోజుల పాటు అమరావతి లోనే ఉండనున్నారు.ముందుగా సీఎంతో వారు చర్చించనున్నారు. అమరావతిలో నిర్మాణాల ప్రణాళికలు, లక్ష్యాలను చంద్రబాబు వారికి వివరించనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేసి నిధుల సమీకరణ దిశగా చర్చించనున్నారు.
* నవ నగరాలు నిర్మించాలన్నది ప్లాన్
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. వాటిని అంతర్జాతీయంగా తీర్చిదిద్దాలన్నది లక్ష్యం.దానిపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అమరావతిలో ఎంచుకున్న ప్రాధాన్యతలు, ఆర్థిక అవసరాల గురించి ఆయన ఆ బృంద సభ్యులకు వివరించుతున్నారు. ఈ కమిటీకి సీఆర్డీఏ నుంచి ఆయా ప్రాజెక్టుల వారీగా ఎంతెంత నిధులు అవసరమన్న లెక్క తేల్చనున్నారు. ఎప్పటికీ వీటికి సంబంధించి ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. ఈ రెండు బ్యాంకుల బృందంలో 14 మంది ప్రతినిధులు ఉంటారని తెలుస్తోంది.
* నేడు రెండు బ్యాంకుల ప్రతినిధుల రాక
సీఎం చంద్రబాబుతో ఆ రెండు బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు. శాశ్విత ప్రభుత్వ కాంప్లెక్స్ లో భాగంగా నిర్మించే సచివాలయ టవర్లు, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్జీవో, సెక్రటరీలు, జడ్జిల భవనాలు, ప్రభుత్వ టైప్ 1, టైప్ 2 భవనాలు, ఎల్ పి ఎస్ ఇన్ఫ్రా, ట్రంక్ ఇన్ఫ్రా, రాజధాని సంబంధిత ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టులన్నింటిపైన సీఎం ఆ రెండు బ్యాంకుల ప్రతినిధులకు సమగ్ర సమాచారాన్ని అందించనున్నారు.
* నిధుల సమీకరణ ఒక కొలిక్కి
మరో నెల రోజుల్లో అమరావతి యధాస్థానానికి రానుంది. ఇంతలో నిపుణుల అధ్యయనం ఏంటన్నది తేలనుంది. ఇప్పటి నిర్మాణాలను కొనసాగించాలా? కొత్త వాటిని నిర్మించాలా? అన్నది తెలుస్తుంది. అదే సమయంలో నిధుల సమీకరణను ఒక కొలిక్కి తేవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందుకు ఈ వారం రోజులు పాటు కీలకమని భావిస్తున్నారు.