AP Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీకి సంబంధించి నాలుగో విడత మే 13న పోలింగ్ జరగనుంది. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. ప్రచార పర్వంలోకి దిగాయి. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజాభిప్రాయం ఇది అంటూ సర్వే ఫలితాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా రైజ్ సంస్థ తాజాగా చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించింది.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చింది. వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందని గుర్తించింది. అయితే ఇప్పటివరకు మెజారిటీ సర్వే సంస్థలు వైసిపి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. అయితే రైజ్ సర్వేలో మాత్రం అధికార వైసీపీకి ప్రతికూల ఫలితాలు తప్పవని తేలడం విశేషం.
ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో 17 నుంచి 19 పార్లమెంట్ స్థానాలు కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని రైజ్ సంస్థ తేల్చింది. అధికార వైసీపీకి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఒకటి నుంచి మూడు చోట్లగట్టి ఫైట్ ఉంటుందని.. అక్కడ కూడా కూటమికే ఛాన్స్ ఉందని చెప్పుకొస్తోంది. దీంతో ఏపీలో అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉందని మరోసారి స్పష్టమైంది. పార్లమెంట్ నియోజకవర్గానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో.. కూటమికి 105 నుంచి 112 అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని తేలింది. వైసీపీకి మాత్రం 63 నుంచి 72 స్థానాల వరకు దక్కే చాన్స్ ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఇప్పటివరకు ప్రకటించిన సర్వేలో వైసీపీకి అనుకూలంగా ఉండగా.. ఈ సర్వే వ్యతిరేకంగా ఉండడంతో కూటమిలోని మూడు పార్టీల్లో జోష్ నెలకొంది.