YCP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ గతంలో చేసిన పాపాలు ఇప్పుడు శాపాలుగా మారుతున్నాయి. వైసిపి హయాంలో కొన్ని రకాల తప్పులు జరిగాయి. అప్పట్లో సీనియర్ నేతలు ప్రేక్షక పాత్ర పోషించారు. దానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా కొందరు వైసీపీ నేతలు ఏ విధంగా ప్రవర్తించారో సీనియర్లకు తెలుసు. కానీ అప్పట్లో నియంత్రించలేకపోయారు. అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్పలేకపోయారు. అప్పట్లో అనుచితంగా ప్రవర్తించిన నేతలను అడ్డుకోలేకపోయారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. నిన్న శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అదే పరిస్థితి ఎదురైంది.
* వైసిపి మహిళా ఎమ్మెల్సీ నిలదీత..
విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha steel plant ) ప్రైవేటీకరణకు సంబంధించి శాసనమండలిలో చర్చ జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఈ అంశంపై గట్టిగానే మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రసంగించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు. అయితే మీరేం పీకారు అంటూ లోకేష్ అనడంతో సీనియర్ నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక మహిళ నేతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. అటువంటి భాష ప్రజాస్వామ్యంలో ఉపయోగించకూడదన్నారు. దీంతో లోకేష్ స్పందించిన తీరు బొత్స ను ఇరకాటంలో పెట్టింది.
* లోకేష్ తల్లి ప్రస్తావన..
ఇదే శాసనసభలో తన తల్లి నారా భువనేశ్వరికి( Nara Bhuvaneswari ) దారుణ అవమానం జరిగిందని గుర్తు చేశారు నారా లోకేష్. తన తల్లి కోలుకునేందుకు 100 రోజుల సమయం పట్టిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని గారు అని సంబోధించానని.. మేడం గారు అని పిలిచానని.. తాను ఎప్పుడూ మహిళలను గౌరవిస్తానని.. తన తల్లి, తమ పార్టీ అధినేత అది మాకు అలవాటు చేశారని చెప్పుకొచ్చారు. మీ అధినేతలా మహిళలపై ఘాటు వ్యాఖ్యలు చేయమని ప్రోత్సహించనని అన్నారు. నాడు తన తల్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినప్పుడు ఒక సీనియర్ మంత్రిగా ఇదే అసెంబ్లీలో ఉన్నారని.. అదే మీ తల్లిని, మీ భార్యను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే ఊరుకునే ఉండేవారా? అని ప్రశ్నించారు. మహిళలను అవమానించిన పార్టీ మీది అని.. దానిని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. అయితే లోకేష్ నుంచి ఈ తరహా స్పందన రావడంతో.. వైసీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. అయితే వైసిపి శాసనమండలి పక్ష నేత బొత్స అనవసరంగా కెలుక్కున్నారు.