TDP: ఎన్నికల్లో వందకు వంద శాతం గెలుస్తామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత, జనసేన తో పొత్తు, బిజెపి కలిసి వస్తుండడం, జగన్ కుటుంబంలో తలెత్తిన విభేదాలు, అనుకూల మీడియా ద్వారా మధ్యతరగతిలో ఆలోచన తెప్పించడం వంటి కారణాలతో.. వచ్చే ఎన్నికల్లో గెలుపు పక్కా అని సగటు టిడిపి అభిమాని బలంగా ఆశిస్తున్నారు. గెలుపు పై నమ్మకం పెట్టుకున్నారు.
గత ఎన్నికల్లో జగన్ గెలుపొందడానికి ప్రధాన కారణం వైఎస్ కుటుంబం. ఆ ఎన్నికల్లో కుటుంబం ఏకతాటిపైకి నిలిచి జగన్ కోసం అహర్నిశలు శ్రమ పడింది. ముఖ్యంగా తల్లి విజయమ్మ, సోదరి షర్మిల జగన్ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం వారిద్దరూ దూరమయ్యారు. షర్మిల అయితే ప్రత్యర్థిగా మారిపోయారు. పీసీసీ పగ్గాలు తీసుకొని సోదరుడు జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ ఓటమి కోసం కంకణం కట్టుకున్నారు. తద్వారా పాజిటివ్ ఓటు బ్యాంకు పై ఇది ప్రభావం చూపనుంది. అంతిమంగా తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూర్చనుంది.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సైతం తమకు కలిసి రానుందని టిడిపి బలంగా నమ్ముతోంది. వివేక హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీత ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టారు. ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో జగన్ కు ఓటెయ్యొద్దని ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే అందరికీ కష్టమని తేల్చి చెప్పారు. వివేక హత్యలో నిందితులను జగన్ కొమ్ముకాస్తున్నారని కూడా ఆరోపించారు. జగన్ ను సైతం విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేశారు. ఈ పరిణామాలన్నీ వైసీపీ పాజిటివ్ ఓటు బ్యాంకు పై ప్రభావం చూపడం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మధ్యతరగతి కుటుంబాలను ప్రభావితం చేసే విధంగా టిడిపి అనుకూల మీడియా కథనాలు రాస్తోంది. ఇది కూడా కలిసి వచ్చే అంశమే.
మరోవైపు పవన్ కళ్యాణ్ జత కలిశారు. జనసేనతో పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సీట్ల విషయంలో జనసేనకు సింహభాగం వెళ్లకుండా చూసుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. మరోవైపు ఇప్పటివరకు వ్యతిరేకంగా ఉన్న బిజెపి న్యూట్రల్ గా మారింది. పొత్తులో భాగంగా కలిసి వస్తుందని కూడా తెలుస్తోంది. ఇన్ని అనుకూలతల నడుమ వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసమని సగటు టిడిపి అభిమాని భావిస్తున్నారు. అటు చంద్రబాబు సైతం ఇదే ఆశతో ఉన్నారు. మరి ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి. వారి అంచనాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.