Chandrababu And KCR: రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజం. దానికి ఎవరూ అతీతులు కాదు. కానీ గెలుపు తలుపు తట్టినప్పుడు ఒకలా.. ఓటమి పలకరిస్తే మరోలా రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రయత్నాలు మారిపోతుంటాయి. తెలుగు నాట ఈ పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొన్నారు. ఇప్పుడు కెసిఆర్ ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో టిడిపి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆ పార్టీ కకావికలం అయ్యింది. కుదురుకునేసరికి దాదాపు మూడేళ్లు పట్టింది. ఇప్పుడు ఎన్నికల ముందు గాడిన పడింది. అధికార పార్టీకి గట్టి పోటీని ఇస్తోంది. కెసిఆర్ సైతం పదేళ్లపాటు అధికారాన్ని వెలగబెట్టారు. వరుసుగా రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి మాత్రం దెబ్బతిన్నారు. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
అయితే చంద్రబాబు, కెసిఆర్ మామూలు నేతలు కారు. తమకు తాము జాతీయ నేతలుగా చెప్పుకునేందుకు ఇష్టపడతారు. అయితే ఈ మాటను ఎవరు కాదనలేరు కానీ.. తమ పార్టీని జాతీయ పార్టీలుగా చెప్పుకుంటారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు తమది జాతీయ పార్టీగా మార్చుకున్నారు. తాను జాతీయ పార్టీ అధ్యక్షుడు అని ప్రకటించుకున్నారు. తెలంగాణ, ఏపీ లకు అధ్యక్షులను నియమించారు. కానీ ఈ జాతీయ పార్టీ ఇప్పుడు కేవలం ఏపీకే పరిమితమైంది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు వస్తున్నా.. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించే పరిస్థితిలో తెలుగుదేశం లేదు. అయినా సరే చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా, లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకుంటారు. అది ఎలా సాధ్యమో అన్నది వారికే ఎరుక.
కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు.తనకు తాను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. మొన్నటి తెలంగాణ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో సభలో మీద సభలు పెట్టారు. ఏపీలో ఒక కార్యవర్గాన్ని నియమించారు. ఒడిస్సా లో ఒక మాజీ ముఖ్యమంత్రిని చేర్చుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ తో కలిసి పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఇవేవీ వర్క్ అవుట్ కాలేదు. అటు తెలంగాణ ఎన్నికల్లో దెబ్బ తినడంతో జాతీయ పార్టీ నామస్మరణ మరిచిపోయారు. సొంత రాష్ట్రంలో పార్టీని నిలబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయినా సరే జాతీయ అధ్యక్షుడు అన్న పదవిని, మాటను వదులుకోలేకపోతున్నారు. తోటి దాయాది రాష్ట్రంలో ఇటు చంద్రబాబు కానీ, అటు కెసిఆర్ కానీ తమ అభ్యర్థులను నిలబెట్టుకునే స్థితిలో లేరు. అటువంటప్పుడు జాతీయ పార్టీగా తమ పార్టీలను ఎలా వర్ణించుకుంటారు. అటు అనుకూల మీడియాలు సైతం ఎలా ప్రకటిస్తాయి. ఎప్పటికైనా తాము జాతీయ పార్టీల అధ్యక్షులు అన్న విషయాన్ని ఆ ఇద్దరు నేతలు విడిచిపెట్టడం చాలా మంచిది.