TDP Janasena First List: పవన్ పై బాబు ఆశ అదే

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. వైసిపి 51 శాతం ఓటుతో విపక్షాలకు అందనంత దూరంలో దూసుకుపోయింది. టిడిపి 40 శాతం ఓటు శాతానికి పరిమితం అయ్యింది.

Written By: Dharma, Updated On : February 25, 2024 12:25 pm
Follow us on

TDP Janasena First List: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కీలకం. ఒక విధంగా చెప్పాలంటే జీవన్మరణ సమస్య లాంటిది. పొరపాటున ఓటమి ఎదురైతే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. చంద్రబాబుకు సైతం వయసు మల్లుతోంది. అటు తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది. అందుకే చంద్రబాబు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆది నుంచి తపన పడుతున్నారు. ఆయనతో ఓటు శాతం పెంచుకోవడంతో పాటు దూరమైన వర్గాలను దరి చేసుకోవడం సాధ్యమని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు పవన్ కు ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండడంపై టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన భావన ఉంది. కానీ చంద్రబాబు పక్క వ్యూహంతోనే అడుగులు వేస్తున్నారు.

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయ్యింది. వైసిపి 51 శాతం ఓటుతో విపక్షాలకు అందనంత దూరంలో దూసుకుపోయింది. టిడిపి 40 శాతం ఓటు శాతానికి పరిమితం అయ్యింది. 2014లో మాత్రం వైసిపి కంటే టిడిపి ఒకటిన్నర ఓటు శాతం సాధించి అధికారంలోకి రాగలిగింది. గత ఎన్నికల్లో ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం చేకూరిందని చంద్రబాబు భావించారు. అందుకే జనసేనతో పాటు బిజెపిని తన వైపు తిప్పుకోవాలని చూశారు. గత ఎన్నికల్లో జనసేనకు ఆరు శాతం ఓట్లు లభించాయి. బిజెపికి ఒక శాతం ఓట్ షేర్ వచ్చింది. ఆ రెండింటిని కలుపుకుంటే 47 శాతానికి కూటమి ఓటు పెరుగుతుందని.. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఐదు శాతం చీలితే.. వైసిపి బలం పడిపోతుందని.. 52 ఓటు శాతంతో కూటమి అధికారంలోకి రాగలుగుతుందని చంద్రబాబు అంచనా వేశారు.

వైసీపీని అధికారం నుంచి దూరం చేయాలన్నదే పవన్ లక్ష్యం. పవన్ సైతం చంద్రబాబు నిర్ణయాలను గౌరవిస్తారు. ఆయన పెద్దరికానికి పెద్దపీట వేస్తారు. ఈ విషయం గమనించిన చంద్రబాబు పవన్ ను ఒక తురుపు ముక్కగా వాడుకోవడం ప్రారంభించారు. జనసేన అధికంగా సీట్లు కోరుతోందని ప్రత్యర్థులు ప్రచారం చేసినా.. కేవలం 24 అసెంబ్లీ సీట్లతో సర్దుబాటు చేసుకోవడం వెనుక చంద్రబాబు చాతుర్యం ఉంది. అటు ఏదో విధంగా బిజెపి అగ్ర నేతలను పవన్ ఒప్పించి తెస్తారని కూడా నమ్మకం ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ సీనియర్లకు ఇష్టం లేకున్నా.. పవన్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఇప్పుడు పవన్ చంద్రబాబుకు ఒక ఆశాదీపం లా మారిపోయారు. గత నాలుగేళ్లుగా పవన్ వ్యవహార శైలి చూస్తే ఇట్టే తేలిపోతుంది. ఎన్నికల ముంగిట సీట్ల సర్దుబాటు, పవన్ వ్యవహార శైలి చూస్తే చంద్రబాబు ప్లాన్ బయటపడుతోంది. పవన్ పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తున్నాయి.