Chandrababu: తెలుగుదేశం,జనసేన అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94, జనసేన అభ్యర్థులు ఐదుగురు పేర్లు వెల్లడించారు. అయితే టికెట్ దక్కని వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ముఖ్యంగా చాలామంది సీనియర్లకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. దీంతో చాలాచోట్ల రాజీనామాల పర్వం నడుస్తోంది. అయితే ఈ పరిణామాలను ఊహించిన చంద్రబాబు తన సన్నిహిత నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురు సభ్యులు గల కమిటీ ఇప్పటికే ఎంటర్ అయ్యింది. అసంతృప్తులను ఒప్పించే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఉదాహరణకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల సీటును జనసేనకు కేటాయించారు. అక్కడ ఇన్చార్జిగా కుర్రోతు బంగార్రాజు ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి కూడా పెద్దదిక్కుగా ఉన్నారు. అక్కడ సీటును జనసేనకు కేటాయిస్తూ నిర్ణయించుకున్నారు. దీంతో టీడీపీ నేతలు అంతా అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే వారిని టిడిపికీలక నాయకులు కలిశారు. ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ అని.. టిడిపి, జనసేన కూటమి ప్రభుత్వం తప్పకుండా అధికారంలోకి వస్తుందని.. ఇప్పుడు టిక్కెట్లు కోల్పోయిన నియోజకవర్గాల టిడిపి నేతలు అందరికీ సముచిత స్థానం ఉంటుందని.. ఎమ్మెల్సీ, రాజ్యసభ తో పాటు నామినేటెడ్ పోస్టులు కల్పిస్తామని.. చంద్రబాబు మాటగా ఇది మీకు చెబుతున్నామని చెబుతూ ఆ ముగ్గురు నేతలు సముదాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అసంతృప్తివాదులు ఎక్కడికి అక్కడే మెత్తబడుతున్నట్లు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు టిడిపి అభ్యర్థులను ఖరారు చేసింది. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బంది లేకున్నా.. చాలాచోట్ల టికెట్లకు పోటీ ఉంది. సామాజిక సమీకరణలు, స్థానిక అంశాలను ప్రాధాన్యతాంశాలుగా తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేశారు.దీంతో కొంతమంది సీనియర్లను సైతం పక్కన పెట్టాల్సి వచ్చింది. గత ఐదేళ్లుగా నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉన్న వారిని సైతం తప్పించాల్సి వచ్చింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి.. ఇప్పుడు టిక్కెట్ లేదంటే ఎలా అని వారు నిలదీస్తున్నారు. వారి అనుచరులు రాజీనామా అస్త్రాలను సంధిస్తున్నారు. దీంతో చంద్రబాబు సన్నిహిత నేతలు రంగంలోకి దిగుతున్నారు. నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎవరైతే అభ్యర్థి అవుతారో వారితో కొంత మొత్తం ఇప్పించేందుకు.. పార్టీ అధికారంలోకి వస్తే ఫలానా పదవి ఇస్తామని.. ఇది తన మాటగా చెప్పాలని చంద్రబాబు నేరుగా చెప్పారని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది నాయకులకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి సముదాయిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే చంద్రబాబు టీం యాక్షన్ ప్లాన్ లోకి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.