Mahesh Reddy challenge to Jagan: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కాసు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. కాసు బ్రహ్మానంద రెడ్డి( Kasu Brahmanandam Reddy ) ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. అటు తర్వాత కాసు వెంకట కృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్నారు. ఆయన సైతం నరసరావుపేట నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించారు. అయితే ఆయన వారసుడు కాసు మహేష్ రెడ్డి మాత్రం నరసరావుపేట నుంచి కాకుండా గురజాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట టిక్కెట్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.
నియోజకవర్గం సర్దుబాటు కాక..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ తొలిసారిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగింది కాసు కుటుంబం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో బలపడదని భావించి 2019 ఎన్నికలకు ముందు కాసు మహేష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అప్పటికే నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా గోపిశెట్టి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన మనిషి కావడంతో తప్పించడానికి వీలు లేకుండా పోయింది. అయితే కాసు మహేష్ రెడ్డిని గురజాల కు పంపించారు జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి 2019, 2024 ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక్కసారి మాత్రమే మహేష్ రెడ్డి గెలిచారు. అక్కడ ఉండడం ఎంత సేఫ్ కాదని భావించి నరసరావుపేట టికెట్ కావాలని కోరుతున్నారు.
టిడిపికి పట్టు..
గురజాలలో యరపతినేని శ్రీనివాస్( YaraPati Neni Srinivas ) రూపంలో గట్టి నాయకుడు ఉన్నారు. అక్కడ గెలవడం అంత ఈజీ కాదు కూడా. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి ఆ ప్రభావం చూపుతూ వస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి గట్టి పట్టు ఉంది. అదే సమయంలో కాసు కుటుంబానికి నరసరావుపేటలోని ఎక్కువ బంధుత్వాలు ఉన్నాయి. సుదీర్ఘకాలం ఆ కుటుంబం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో నరసరావుపేట షిఫ్ట్ కావాలని కాసు మహేష్ రెడ్డి చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏ విషయము చెప్పడం లేదు. దీంతో కాసు ఫ్యామిలీలో అసహనం పెరుగుతోంది. 2029 ఎన్నికల్లో నరసరావుపేట టిక్కెట్ ఇస్తే సరి.. అంతకుముందే ఇన్చార్జి పదవి సైతం తనకు అప్పగించాలని మహేష్ రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. కానీ అక్కడ జగన్ ఆత్మీయుడు గోపిశెట్టి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.