Thalliki vandanam Scheme Guidelines : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టింది. ఇదే నెలలో కీలకమైన రెండు పథకాలకు శ్రీకారం చుట్టనుంది. ప్రధానంగా పాఠశాలల ప్రారంభానికి ముందు తల్లికి వందనం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాల ఖరారు పైన అధికారులు ఫుల్ ఫాకస్ పెట్టారు. పాఠశాలలు తెరుచుకోవడానికి కేవలం వారం రోజుల వ్యవధి ఉండడంతో.. వీలైనంత త్వరగా ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నారు. పథకం లబ్ధిదారుల అర్హతలు, వివరాలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్లో సైతం నిధులు కేటాయించడంతో ఈ నెలలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం దక్కనుంది.
Also Read : రైతన్నకు శుభవార్త.. పీఎం కిసాన్ 20వ విడత డేట్ వచ్చేసింది.. ఈ పని త్వరగా చేసేయండి
* ఆ లింకులు తప్పనిసరి..
తల్లికి వందనం(Thalliki vandanam) పథకం నిధులు పొందాలంటే రెండు ముఖ్యమైన లింకింగ్ ప్రక్రియలు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్ ను ఆధార్ తో లింక్ చేయడం ముఖ్యం. అదేవిధంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో లింక్ చేయాలని సూచిస్తున్నారు. ఈ ఏడాది బడికి వెళ్లే ప్రతి విద్యార్థి ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలుస్తోంది. కానీ అన్ని అర్హతలు దాటుకొని 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్లు సమాచారం.
* ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి..
తాము అధికారంలోకి వస్తే ప్రతి విద్యార్థి చదువుకు 15000 రూపాయల చొప్పున సాయం చేస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వర్తింప చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న విద్యార్థులకు ఈ పథకం అమలు చేయాలంటే దాదాపు రూ. 10,300 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మరోవైపు విద్యార్థులకు 75% హాజరు నిబంధన సైతం కొనసాగనుంది. 2025-26 బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయింపులో భాగంగా ప్రస్తుతం కసరత్తు ప్రారంభించారు. ఈ పథకం అమలుకు సంబంధించి విధివిధానాలపై కూడా అధ్యయనం చేస్తున్నారు. గత ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సైతం సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించే వారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం అందలేదు. ఇందులో కొన్ని మార్గదర్శకాలను మార్చే అవకాశం ఉంది.
* అప్పట్లో వ్యతిరేకించిన కూటమి..
అయితే కూటమి విపక్షంలో ఉన్నప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమ్మ ఒడి( Amma Vadi ) అమలు చేసింది. ఆ సమయంలో ఈ నిబంధనలన్నీ ఉండేవి. అప్పట్లో కూటమి వాటిని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి వస్తే ఇటువంటి నిబంధనలేవీ పెట్టకుండా.. అందరికీ తల్లికి వందనం కింద సాయం అందిస్తామని చెప్పుకొచ్చింది. మరో కొద్ది రోజుల్లో తల్లికి వందనం అమలు చేయనుండడం.. అర్హత, మార్గదర్శకాల జారీపై లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆసక్తి కనిపిస్తోంది. చూడాలి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో?