https://oktelugu.com/

Vizag Tahsildar: విశాఖలో తహసిల్దార్ దారుణ హత్య.. అదే కారణం

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల రమణయ్య తహసిల్దార్ గా పని చేస్తున్నారు. విశాఖ రూరల్ తహసీల్దారుగా ఉన్న రమణయ్య ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు.

Written By:
  • Dharma
  • , Updated On : February 3, 2024 / 01:59 PM IST
    Follow us on

    Vizag Tahsildar: విశాఖలో తహసిల్దార్ దారుణ హత్య కలకలం రేపింది. నేరుగా తహసిల్దారు ఇంటి వద్దకు వచ్చి దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న తహసిల్దారును ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు.అయితే ఆయన హత్య వెనుక భూ తగాదాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ విధి నిర్వహణలో ఆయన నిజాయితీపరుడని తోటి అధికార సిబ్బంది చెబుతున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

    శ్రీకాకుళం జిల్లాకు చెందిన సనపల రమణయ్య తహసిల్దార్ గా పని చేస్తున్నారు. విశాఖ రూరల్ తహసీల్దారుగా ఉన్న రమణయ్య ఎన్నికల నేపథ్యంలో విజయనగరం జిల్లా బొండపల్లికి బదిలీ అయ్యారు. విశాఖ నగరంలోని కొమ్మాదిలో ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఆయన బొండపల్లిలో బాధ్యతలు స్వీకరించారు. రాత్రి పది గంటల సమయంలో ఫోన్ రావడంతో అపార్ట్మెంట్ కిందకు వచ్చారు. గేటు బయట తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తితో మాట్లాడారు. ఈ క్రమంలో నిందితుడు ఇనుప రాడ్డుతో రమణయ్య పై దాడి చేసి పరారయ్యాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో రమణయ్య అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన వాచ్ మెన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు కిందకు దిగి.. రమణయ్య ను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. అయితే ఈ హత్యలో పాల్గొన్నది ఒకరు కాదని.. నలుగురు అని తేలడం విశేషం.

    తహసిల్దార్ హత్యతో రెవెన్యూ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హత్య వెనుక భూ వివాదాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతుడి సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. చీపురుపల్లి లో ఓ ఏడు ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోందని.. ప్రసాద్ అనే బ్రోకర్ తరచూ బెదిరించేవాడని.. ఈ సాయంత్రంలోగా చంపేస్తానని ఫోన్లో హెచ్చరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే రంగంలోకి దిగిన విశాఖ నగర పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సి సి ఫుటేజీలను పరిశీలించి హత్యలో పాల్గొంది నలుగురు వ్యక్తులని నిర్ధారించారు. ఒకటి రెండు రోజుల్లో నిందితుల పేర్లు వెల్లడిస్తామని విశాఖ నగర డిప్యూటీ కమిషనర్ మణికంఠ తెలిపారు.