TDP: గతంలో మీడియా యాడ్లు విభిన్నంగా వచ్చేవి. ప్రజలను ఆకట్టుకునేందుకు కంపెనీలు పోటీపడేవి. కానీసోషల్ మీడియా విస్తృతం అవుతున్న వేళ.. ప్రకటనల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో.. అన్ని రాజకీయ పార్టీలు రకరకాల మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనాడులో నీతోనే నేను మీకోసమే నేను అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన యాడ్ వైరల్ అవుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఈనాడులో ప్రచురితమైన ఈ యాడ్ ట్రెండింగ్ గా నిలుస్తోంది. మంచి ఆలోచనగా కనిపిస్తోంది.
ఎన్నికల్లో ప్రచారానిదే కీలక భూమిక. ప్రచారంలో ముందంజలో ఉంటేనే ఓటర్లను ఆకట్టుకునేది. అందుకే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఒక అభ్యర్థి వినూత్న ప్రయత్నం చేశారు. నీతో ఒక్క మాట గుంటూరు పశ్చిమ ప్రజలారా! నమస్కారాలు అంటూ శీర్షికన సాగే ఈ ప్రకటనలో..’ మనం బాగుండాలి అంటే ఏమి ఉండాలి? నిత్యవసరాలు అందుబాటు ధరల్లో ఉండాలి. పేదలకు సొంతిల్లు ఉండాలి. రేషన్ లో పౌష్టికాహార సరుకులు అందించాలి. ఉచిత విద్య ఉండాలి. ఉన్నత విద్యకు ఫీజు రియంబర్స్మెంట్ అందాలి. మన ఆరోగ్యానికి రక్షణ ఉండాలి. ఎలాంటి జబ్బు కైనా ఉచిత వైద్యం అందాలి. స్త్రీలకు, పేదలకు, దళితులకు, మైనారిటీలకు రక్షణ ఉండాలి. మహిళలకు జిల్లాలో ఉచిత రవాణా ఇవ్వాలి. వంటగ్యాస్ అందుబాటు ధరలు అందాలి ‘ అదే నా తపన.. నా ఆలోచన.. మీతో పంచుకుంటాను. రేపు మళ్లీ ఇక్కడే కలుస్తాను. ఇట్లు మీలో ఒకరిని అంటూ ఈ యాడ్ ఆకట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా మరి నా మాటకు మీరేమంటారు అంటూ.. మెయిల్ అడ్రస్, వాట్సాప్ నెంబర్ పంచుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ యాడ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈనాడులో యాడ్ రావడం.. పసుపు మయంగా ఉండడం.. టిడిపి సూపర్ సిక్స్ పథకాలకు దగ్గరగా ఉండడంతో ఇది కచ్చితంగా టిడిపి అభ్యర్థి చేసిన పని అని తెలుస్తోంది.
ఈ తరహా యాడ్ లను ట్రాపింగ్ యాడ్లు అంటారు. ప్రజల దృష్టిని మరల్చడంలో ఈ తరహా యాడ్లు ఎంతగానో దోహదపడతాయి. గతంలో పేరుమోసిన కంపెనీలు ఈ తరహా ప్రకటనలకు ప్రాధాన్యమిచ్చేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఈ యాడ్ల స్వరూపం మారుతూ వచ్చింది. గతంలో ఎయిడ్స్ నియంత్రణకు ఒక యాడ్ వచ్చింది. పులి రాజాకు ఎయిడ్స్ వస్తుందా? అన్న యాడ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎయిడ్స్ పై విస్తృతంగా చర్చ జరిగింది. ఇప్పుడు అదే తరహా ట్రాపింగ్ యాడ్ ను తెలుగుదేశం పార్టీ ప్రయోగించడం విశేషం. అయితే ఇది టిడిపి ప్రయోగించిందా? లేకుంటే ఎన్నికలను క్యాష్ చేసుకునేందుకు ఈనాడు ఈ తరహా ప్రయత్నం చేస్తుందా? అన్నది తెలియాలి.