TDP Formation Day 2026: తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) 45వ పడిలో పడింది. 44 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రను దాటింది. దేశంలో ఒక ప్రాంతీయ పార్టీలకు మార్గదర్శిగా నిలిచింది. అయితే అది అంత సులువుగా జరగలేదు. ఎన్నో సంక్షోభాలను దాటుకొని.. ఓటములను తట్టుకొని నిలబడింది. పడిపోయిన ప్రతిసారి తనను తాను నిలబెట్టుకుంది. తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన ఆ పార్టీ.. బడుగు, బలహీన వర్గాలకు ఆశాదీపంగా మారింది. అప్పటివరకు రాజకీయ వాసనలు తెలియని సామాన్యులతో పాటు బడుగులకు అవకాశం దక్కింది తెలుగుదేశం పార్టీ ద్వారా. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పాలకులంతా ఆ పార్టీ నుంచే వచ్చిన వారే. నాలుగున్నర దశాబ్దాల పాటు తెలుగు రాష్ట్రాలనే కాదు.. ఈ దేశంలోనే తనకంటూ ఒక ముద్ర చాటుకుంది తెలుగుదేశం పార్టీ. టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘ఓకే తెలుగు’ ప్రత్యేక కథనం..
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
* తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో..
తెలుగు రాష్ట్రాన్ని ఢిల్లీ శాసిస్తున్న వేళ.. ముఖ్యమంత్రులు ఎవరో కాంగ్రెస్ హై కమాండ్( Congress High Command) షీల్డ్ కవర్లు పంపిస్తున్న వేళ. తెలుగు వాడి ఆత్మ గౌరవం నినాదంతో ముందుకు వచ్చింది ఒక సింహ స్వప్నం. అదే నందమూరి తారక రామారావు. ఢిల్లీ పెత్తనాన్ని సహించలేక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటన చేశారు. 1982 మార్చి 29న.. హైదరాబాద్ ఎమ్మెల్యే వర్కర్స్ ప్రాంగణంలో పరిమిత సంఖ్యలో విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ‘రా కదలిరా.. తెలుగుదేశం పిలుస్తోంది కదలిరా’ అంటూ పిలుపునిచ్చారు. ఆ పిలుపునకు ఏపీ ప్రజలు కదలి వచ్చారు. ఇంతింతై.. వటుడింతై అన్నట్టు తెలుగుదేశం విశ్వరూపం చూపించింది. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఏపీలో కూకటి వేళ్ళతో పెకిలించింది. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. పార్టీ ఏర్పాటు చేసిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చింది. దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ సరికొత్త రికార్డు సృష్టించింది. మిగతా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ఏర్పాటుకు మార్గం చూపింది.
* స్వల్ప కాలంలోనే సంక్షోభం..
తెలుగుదేశం పార్టీకి స్వల్ప కాలంలోనే రాజకీయ సంక్షోభం ఎదురైంది. ఢిల్లీని(Delhi )ఎదిరించి తొమ్మిది నెలల కాలంలోనే అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మింగుడు పడలేదు. అందుకే నాదేండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసింది. కానీ నందమూరి తారక రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో సామూహికంగా రాజీనామాలు చేయించి మరోసారి ఎన్నికకు సిద్ధపడ్డారు. అలా 1985లో రెండోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 1989 లో మాత్రం తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది. ఆ సమయంలోనే నందమూరి తారక రామారావు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినా సరే రాష్ట్ర రాజకీయాల్లో ఉంటూనే జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావంతమైన శక్తిగా పనిచేశారు. 1994లో టిడిపి అధికారంలోకి వచ్చింది. కానీ 1995లో టిడిపిలో సంక్షోభంతో పార్టీతో పాటు ప్రభుత్వం ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతిలోకి వచ్చింది. ఒక విధంగా ఎన్టీఆర్ శకం అప్పటితో ముగిసింది.
* అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చంద్రబాబు..
చంద్రబాబు( CM Chandrababu) ఎంత కాలం పార్టీని నడపగలరు అనే మాటలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ కూల్చివేస్తుంది అని చెప్పుకొచ్చారు. వెన్నుపోటు నాయకుడిగా చంద్రబాబును చిత్రీకరించారు. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు చంద్రబాబు. ఆయన సారథ్యంలోనే 1999 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన ముద్ర చాటింది. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నడవడంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు. కానీ 2004లో ఆ పార్టీకి మరోసారి ఓటమి ఎదురైంది. 2009లో సర్వశక్తులు వడ్డింది. కానీ టిడిపి నెగ్గుకు రాలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని అంతా భావించారు. అటువంటి సమయంలోనే చంద్రబాబు స్థితప్రజ్ఞత ప్రదర్శించారు. 2014 రాష్ట్ర విభజనతో ఏపీ చంద్రబాబు సీనియారిటీని గుర్తించి అధికారం కట్టబెట్టారు. అయితే ఐదేళ్లపాటు ఒడిదుడుకుల మధ్య రాష్ట్రాన్ని పాలించారు. 2019లో తెలుగుదేశం పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. కానీ దానిని ఒక గుణపాఠంగా మార్చుకుని చంద్రబాబు పోరాడారు. పార్టీ శ్రేణుల్లో పోరాట పటిమను నింపారు. జనసేనతో పాటు బిజెపి పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది తెలుగుదేశం. ఒక్క మాటలో చెప్పాలంటే టిడిపి పడిపోయిన ప్రతిసారి అంతే వేగంతో లేచింది. కలబడి నిలబడగలిగింది. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగున్నర దశాబ్దాల పాటు కొనసాగడం అంత సులువైన విషయం కాదు. కానీ దానిని అధిగమించగలిగింది తెలుగుదేశం. ఎన్టీఆర్ పార్టీ నిర్మాణం.. చంద్రబాబు నడిపే విధానం తోనే ఇది సాధ్యం. ఇలానే కొనసాగితే వందేళ్లపాటు తెలుగుదేశం పార్టీ కొనసాగుతుందన్నడంలో ఎటువంటి అతిశయక్తి లేదు.