CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) విషయంలో చాలామంది నేతలు విమర్శలు చేస్తుంటారు. అయితే అలా విమర్శలు చేసిన చాలామంది నేతలు కాలక్రమంలో ఆయన గొప్పతనాన్ని చెబుతుంటారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అలానే కామెంట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబుపై చాలాసార్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ తప్పని అర్థం వచ్చేలా ఆయనే మాట్లాడారు. చంద్రబాబును తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పుకొచ్చారు. నిన్ననే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు చంద్రబాబును ఆహ్వానించారు. ఈ క్రమంలో తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు. అయితే కోమటిరెడ్డి లాంటి నేత వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం తెలంగాణ ప్రజల్లో కూడా ఒక రకమైన ఫీలింగ్ చంద్రబాబుపై తొలగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ సమాజంలో చంద్రబాబు అనే నేత ఒక బూచిగా చూపిస్తూ ఇన్నేళ్లపాటు రాజకీయం చేశారు. కానీ క్రమేపి అది అవాస్తవం అని అర్థం వచ్చేలా ఇప్పుడు నేతలు ఒక్కొక్కరు ముందుకు వచ్చి చంద్రబాబుపై పొరపాటు పడ్డామని వ్యాఖ్యానించే దాకా పరిస్థితి వచ్చింది.
* ఐటీ కి పెద్దపీట..
2003 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించారు చంద్రబాబు. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. ఆ సమయంలోనే విజన్ 20 20 అంటూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యమిచ్చారు. అయితే దానికి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువగా కనెక్ట్ కాలేదు. పైగా సైబరాబాద్, ఐటీ పరిశ్రమలు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన వంటి చంద్రబాబు ప్రకటనలపై వారు విశ్వసించలేదు. చంద్రబాబును వ్యతిరేకించడం ప్రారంభించారు. 2003 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ సమయంలోనే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి తన టీం ను ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో కెసిఆర్ రూపంలో చంద్రబాబుకు కొత్త శత్రువు తయారయ్యారు. ఒకవైపు చంద్రబాబును వ్యతిరేకించే కాంగ్రెస్.. ఇంకోవైపు చంద్రబాబును విభేదించి బయటకు వచ్చిన కేసీఆర్ ఉద్యమ రూపంలో తెలంగాణ సమాజంలో ఒక విలన్ గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. చంద్రబాబు పట్ల తెలంగాణ సమాజం వ్యతిరేకమయ్యేలా కేసీఆర్ కీలకపాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన సమకాలీకుడుగా ఉన్న చంద్రబాబు ఏకైక టార్గెట్ అయ్యారు కెసిఆర్ కు. అలా తెలంగాణలో చంద్రబాబు వ్యతిరేకముద్ర అలానే ఉండిపోయింది.
* చంద్రబాబు విషయంలో అలా..
అయితే కాలక్రమంలో రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు విషయంలో కాస్త రియలైజ్ అయ్యారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి (cm revanth reddy )నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు సహకారం ఉందన్నది విశ్లేషకుల మాట. మరోవైపు కేసీఆర్ పాలనను చూసిన తెలంగాణ ప్రజలు.. తొలుత సెంటిమెంట్ అస్త్రంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తరువాత జాతీయస్థాయిలో తన పార్టీని విస్తరించే పనిలో విఫలం అయ్యారు. ఈ పరిస్థితులన్నీ చంద్రబాబు పట్ల తెలంగాణ సమాజంలో ఉన్న అభిప్రాయాన్ని మార్చేశాయి. పైగా హైదరాబాదులో చంద్రబాబు నాడు చేసిన పనులు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. లక్షలాదిమంది యువతకు ఐటీ లో ఉద్యోగాలు వస్తున్నాయి. అప్పట్లో వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారే చంద్రబాబును తప్పుగా అర్థం చేసుకున్నామని.. ఆయన ఐటి పరంగా చేసిన సేవలను గుర్తు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజల్లో ఆయన పట్ల ఉన్న అపోహలను ఒక్కొక్కటి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు విమర్శించిన నేతలే. నిజంగా చెప్పాలంటే చంద్రబాబుకు ఇది మంచి కాలమే.