Chandrababu Telangana Politics: తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు( CM Chandrababu) పవర్ ఫుల్. ఇది ఎవరు కాదనలేరు కూడా. ఏపీలో సైతం ఆయన చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణలో సైతం అదే మాదిరిగా ఉన్నాయి. ఏపీలో అయితే ఓకే కానీ.. తెలంగాణలో సైతం చంద్రబాబు చుట్టూ రాజకీయాలు తిరుగుతుండడం మాత్రం గుర్తించాల్సిన విషయం. ఎందుకంటే ఏపీలో కేసీఆర్ పేరు వినిపించదు.. రేవంత్ రెడ్డి ప్రస్తావన ఉండదు.. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి చర్చ ఉండదు.. కానీ రెండు రాష్ట్రాల్లో మాత్రం చంద్రబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు అవుతోంది. 2014, 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేసింది. కానీ తరువాత ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. అయినా సరే ఎందుకు తెలంగాణలో చంద్రబాబు చర్చ లేనిదే అక్కడ రాజకీయాలు నడవడం లేదు.
అదే ప్రయత్నంతో..
తెలంగాణలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్( KCR) నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరకు… హరీష్ రావు నుంచి జగదీశ్వర్ రెడ్డి వరకు… బిఆర్ఎస్ లో నాయకులంతా చంద్రబాబు కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు. ఆయన పేరు చెప్పి తమ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎత్తిచూపాలన్నా.. కాంగ్రెస్ ను దుయ్యబట్టాలన్నా.. తెర వెనుక వైసీపీకి సాయం చేయాలన్నా.. చివరకు బిజెపి పై విమర్శలు ఎక్కుపెట్టాలన్నా అందుకు బిఆర్ఎస్ ఎంచుకునే పేరు చంద్రబాబు. ఆ రాష్ట్రంలో చంద్రబాబు రాజకీయం చేయకుండా ఆయన పేరు మార్మోగుతూనే ఉంటుంది.
నిత్యం చంద్రబాబు నామస్మరణ.. తెలంగాణలో( Telangana) ప్రాజెక్టులు ఆగిపోయిన అందుకు చంద్రబాబు కారణం. ఏపీలో ప్రాజెక్టులు నిర్మించిన అందుకు బాబే కారణం. తెలంగాణ ముఖ్యమంత్రి తుమ్మితే కూడా బాబే కారణం. చివరకు ఏపీ ప్రతిపక్ష నేత దక్కిన దానికి బాబే కారణం. తాజాగా మీడియా ముందుకు వచ్చారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ తన పాత బాస్ చంద్రబాబుకు కోపం వస్తుందని పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కన పడేసారంటూ ఆరోపణలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తే కెసిఆర్ కు పేరు వస్తుందని.. అందుకే దానిని పక్కన పెట్టి కాలువల ద్వారా నీళ్లు తవ్వడం మొదలు పెట్టారని.. ఇదంతా తన గురువు చంద్రబాబు కోసమే రేవంత్ చేస్తున్నారు అంటూ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు రియాక్ట్ కావాలి. ఆ సెంటిమెంట్ ను ప్రయోగించి మరోసారి తెలంగాణలో గులాబీ పార్టీని లేపాలి. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే తన పని తాను చేసుకొని వెళ్తున్నారు.