Nara Lokesh: తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నాయకత్వం అవసరం. చంద్రబాబు జైలుకెళ్లడంతో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సంక్షోభం దిశగా పార్టీ పయనిస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో పార్టీని దిశా నిర్దేశం చేయగల నాయకుడు అవసరం. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నుంచి నాయకత్వం తయారయ్యింది. ఇప్పుడు లోకేష్ కు ఆ ఛాన్స్ వచ్చింది. సంక్షోభాన్ని అధిగమించి పార్టీని విజయ తీరాల వైపు చేర్చే అద్భుత అవకాశం లోకేష్ కు వచ్చింది.
చంద్రబాబు సైతం సంక్షోభాలను అధిగమించి పార్టీని స్వాధీనం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈరోజుకి కూడా టిడిపి అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే టిడిపి అన్నట్టు పరిస్థితిని మార్చగలడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. నాడు ఎన్టీఆర్ను గద్దె దించి తాను ముఖ్యమంత్రిగా కావడానికి చంద్రబాబు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఒకవైపు నందమూరి కుటుంబాన్ని, మరోవైపు ఎంపీ,ఎమ్మెల్యేలను, ఇంకోవైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకొని పార్టీని, అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో చంద్రబాబు సఫలీకృతులయ్యారు. ఆనాటి నుంచి.. నిన్న జైలుకు వెళ్లే వరకు అడుగడుగునా సంక్షోభాలను అధిగమించగలిగారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంధి కాలం. పార్టీకి దిశా నిర్దేశం చేయగలిగిన నాయకుడు అవసరం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీలకు అధినేత కీలకం. ఇప్పుడా అధినాయకత్వాన్ని లోకేష్ అందిపుచ్చుకోవాలి. పార్టీకి అనుబంధ సంఘాలు, కీలక నాయకులు ఉన్నా అవి గాడిన పెట్టేందుకు మాత్రం అక్కరకు రావు. లోకేష్ నాయకత్వం అందుకొని తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని ప్రతి గడపకు వెళ్లి చెప్పాలి. ప్రతి పౌరుడు గుండెచప్పుడు కావాలి. అప్పుడే తండ్రి మాదిరిగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ గట్టెక్కే ఛాన్స్ ఉంది.
ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. తన నాయకత్వం నిరూపించుకునేందుకే యాత్ర చేపడుతున్నారన్న టాక్ ఉంది. అయితే ఇందులో కొంతవరకు ఆయన సక్సెస్ అయ్యారు. ప్రత్యర్థుల అంచనాలు దాటి వెళ్లారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు కేసుల రూపంలో మరో ఛాన్స్ లోకేష్ కి లభించింది. తన తండ్రి లేని లోటును భర్తీ చేసే అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవాల్సిన బాధ్యత లోకేష్ పై ఉంది. ఆయన పనితీరుపైనే నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీ భవిత ఆధారపడి ఉంది. ఈ సంక్షోభ కాలాన్ని అధిగమించగలిగితే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు తిరుగుండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి లోకేష్ ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తారో చూడాలి.