Giri Vs Kranthi: తెలుగు నాట కుటుంబ రాజకీయాలు ఎక్కువగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్నా చెల్లెలు మధ్య రాజకీయ విభేదాలు నడుస్తున్నాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఆయన సోదరి షర్మిల విభేదిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో అన్న ఓటమికి కంకణం కట్టుకొని విజయం సాధించారు షర్మిల. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. కెసిఆర్ కుమారుడు కేటీఆర్ ను సోదరి కవిత విభేదిస్తున్నారు. తన తండ్రి కెసిఆర్ ను తప్పు దోవ పట్టిస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఏపీలో ఇప్పుడు మరో అన్నా చెల్లెలు రాజకీయంగా విభేదించుకోవడం ప్రారంభించారు. వారే సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరి, కుమార్తె క్రాంతి. ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. తన తండ్రిని కలవకుండా సోదరుడు అడ్డుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు క్రాంతి. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని కలవనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె రాసిన లేక వైరల్ గా మారింది.
Also Read: ఆర్కే కొత్త పలుకు: జగన్ ఒక్కడే కాదు.. అందరూ నేతల రాజకీయాలూ వాటితో ముడిపడినవే!
* సవాల్ చేసి పేరు మార్చుకుని..
జనసేన అధినేత పవన్ ( Pawan Kalyan)విషయంలో ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడితో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని శపధం చేశారు. అలా చేయని క్రమంలో తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని సవాల్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఫలితం లేకుండా పోయింది. చివరకు పవన్ కళ్యాణ్ ఓడిపోయేసరికి తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకోవాల్సి వచ్చింది. అయితే తన తండ్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు కుమార్తె క్రాంతి. గత ఎన్నికలకు ముందు ఆమె జనసేనలో చేరేందుకు సిద్ధపడ్డారు. పవన్ వద్దని వారించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె జనసేనలో చేరారు. అప్పటినుంచి కుటుంబంలో విభేదాలు నడుస్తున్నాయి.
* కుమార్తె సంచలన లేఖ
ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంను( mudragada Padmanabham ) కలిసేందుకు క్రాంతి ఇటీవల ప్రయత్నం చేశారు. కానీ ఆమెను కలవకుండా కుమారుడు గిరి అడ్డుకుంటున్నారన్నది ఒక ప్రచారం. ఈ నేపథ్యంలోనే ముద్రగడ కుమార్తె క్రాంతి ఒక లేఖ సోషల్ మీడియాలో రాశారు. తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నారని.. ఆయనను చూసేందుకు సైతం తనకు అనుమతించడం లేదని.. తన సోదరుడు గిరి తో పాటు ఆయన భార్య తరపు బంధువులు ముద్రగడ పద్మనాభమును బంధించారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇది ముద్రగడ కుటుంబంలో ఉన్న విభేదాలను బయటపెట్టింది. ముద్రగడ అంటే రాజకీయ నేత కాదు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతగానే గుర్తింపు పొందారు. అటువంటి నేత కుటుంబంలో ఇద్దరు పిల్లలు విడిపోయి, విభేదించుకోవడంపై అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో కాపు ప్రతినిధులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
* జీవో వెనక్కి..
ఇటీవల తుని( tuni) రైలు దహనం కేసులో ముద్రగడ పద్మనాభం పై కోర్టులో అపీల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తర్వులను కూడా జారీ చేసింది. కానీ ఆ మరుసటి రోజునే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటూ జీవో జారీ చేసింది. కాపు ఉద్యమంలో భాగంగా తునిలో రైలు దహనమైన సంగతి తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ముద్రగడ పద్మనాభం ఉన్నారు. వైసిపి హయాంలో విజయవాడ రైల్వే కోర్టు ఆ కేసును కొట్టివేసింది. వైసిపి ప్రభుత్వం కూడా ఆహ్వానించింది. ఇప్పుడు ఆ కేసు కొట్టివేతను సవాల్ చేస్తూ అపీల్ కు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ మరుసటి రోజు ఆ నిర్ణయాన్ని ఒప్పుసంహరించుకుంది. అయితే తాజాగా ముద్రగడకు తీవ్ర అనారోగ్యం అంటూ కుమార్తె బయట పెట్టడంతో.. ప్రభుత్వం సైతం అందుకే వెనక్కి తగ్గి ఉంటుందన్న అనుమానాలు ఉన్నాయి.