TDP Social Media: ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తోంది. ఇప్పటికే జనసేనతో టిడిపి పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు బిజెపి చేరడం దాదాపు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు సవ్యంగా జరగాలి. సమన్వయంతో ముందుకెళ్లాలి. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా.. అది పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడం ఖాయం.ముందుగా సోషల్ మీడియా విభాగాలను పార్టీలు కంట్రోల్ చేయడం ఉత్తమం.
2018లో బిజెపి, టిడిపి విడిపోవడానికి ఆ రెండు పార్టీల సోషల్ మీడియాలే కారణం. నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ కు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అప్పటికే విభజన హామీల అమలు విషయంలో కేంద్రంతో చంద్రబాబు అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా రెచ్చిపోయింది. ఏకంగా ప్రధాని మోదీ తో పాటు బిజెపి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టింది. దీంతో బిజెపి సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రెండు పార్టీల మధ్య విభేదాలు పతాక స్థాయికి చేరాయి. దీంతో ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటకు వచ్చారు.అప్పట్లో ఈ రెండు పార్టీల వైరానికి టిడిపి సోషల్ మీడియా కారణమని ప్రధాన ఆరోపణగా ఉంది.
2018లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది. దశాబ్దాల సైద్ధాంతిక వైరాన్ని పక్కన పెట్టి మరి చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అప్పట్లో కూడా తెలుగుదేశం సోషల్ మీడియా కొంచెం అతిగా ప్రవర్తించింది. కాంగ్రెస్ శ్రేణులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దాని ఫలితంగా ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగలేదు. దీంతో అక్కడ పొత్తు లక్ష్యం దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం దారుణ ఓటమి చవిచూసింది.అయితే అప్పట్లో తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన అతి ఆ పార్టీకి కష్టాలు తెచ్చి పెట్టింది. అప్పటి అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేసుకోవడానికి కారణమైంది.
ఇప్పుడు ఏపీలో టిడిపి, జనసేనతో కలిసేందుకు బిజెపి ఒప్పుకుంది. ఇటువంటి సమయంలో సర్దుబాటు చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి మూడు పార్టీలపై ఉంది. సింహభాగం ప్రయోజనాలు, రాజకీయ ఆధిపత్యం, భవిష్యత్ రాజకీయాల కోసం అతిగా ప్రవర్తిస్తే నష్టపోయేది తెలుగుదేశం పార్టీయే. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. ఇక జరగాల్సింది మరో ఎత్తు. బిజెపి ఆర్ఎస్ఎస్ భావజాలం గలది. అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు బిజెపి సోషల్ మీడియా కంట్రోల్ లో ఉంటుంది.. టిడిపిలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. ఇక్కడ ఏ మాత్రం టీడీపీ సోషల్ మీడియా తోక జాడిస్తే.. దాని పర్యవసానాలు పొత్తుపై ప్రభావం చూపుతాయి. ఇక తెలుసుకోవాల్సింది టిడిపి సోషల్ మీడియా విభాగమే.