Ex MLA Ravindhranath Reddy : వైసీపీ అంటే కడప..కడప అంటే వైసీపీ అన్నట్టు ఉండేది పరిస్థితి.అటు ఉమ్మడి రాష్ట్రంలో సైతంకడప జిల్లాకు వచ్చేసరికి రాజశేఖర్ రెడ్డి కుటుంబ హవా నడిచేది. టిడిపి ఆవిర్భావం తర్వాత కూడా ఈ జిల్లాపై ఆ పార్టీ పట్టు సాధించింది తక్కువే.అటువంటిది ఈ ఎన్నికల్లో వైసీపీకి జిల్లాలో దారుణ పరాజయం ఎదురయింది.పది నియోజకవర్గాలకు గాను ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు.పులివెందులలో జగన్ తో పాటు మరో రెండు చోట్ల మాత్రం వైసిపి అభ్యర్థులు నెట్టుకొచ్చారు.అయితే ఎన్నికల అనంతరం..కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప జిల్లాలో రాజకీయంపూర్తిగా మారిపోయింది. వైసిపి ద్వితీయ శ్రేణి క్యాడర్ చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. కూటమి పార్టీల్లో చేరుతున్నారు.ఈ తరుణంలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి షాక్ ఇచ్చారు కమలాపురం మున్సిపల్ చైర్మన్ తో పాటు వైసిపి కౌన్సిలర్లు.ఒకేసారి అంతా కలిసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.వైసిపి హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుఆ పార్టీ స్వీప్ చేసింది.కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి ఆ పార్టీ శ్రేణులు తట్టుకోలేకపోతున్నారు.పార్టీ మారడమే ఉత్తమమని భావిస్తున్నారు.
* ఎమ్మెల్యేగా ఓటమి
అసెంబ్లీ ఎన్నికల్లోవైసిపి అభ్యర్థిగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోటీ చేశారు.సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న ఆయన బరిలో దిగారు.టిడిపి అభ్యర్థిగా కృష్ణ చైతన్య రెడ్డి రంగంలోకి దిగారు. అయితే రవీంద్రనాథ్ రెడ్డిపై కృష్ణ చైతన్య రెడ్డి విజయం సాధించారు.అయితే కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారడంతో జగన్ తన మేనమామకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు.దీంతో ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు.ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రవీంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గం కమలాపురం పై దృష్టి పెట్టింది.కమలాపురం మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని భావించింది.ఆ దిశగా పావులు కలిపింది.దీంతో మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు కౌన్సిలర్లు టిడిపిలో చేరారు.
* వైసీపీ సెకండ్ కేడర్ ఖాళీ
ఇటీవలే కమలాపురం నియోజకవర్గం వీరపు నాయిని పల్లె జడ్పిటిసి సభ్యుడు వైసీపీకి రాజీనామా చేశారు. ఇంతలోనే ఇప్పుడు మున్సిపల్ కార్యవర్గమంతా టిడిపి గూటికి వచ్చింది. దీంతో జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి షాక్ ఇచ్చినట్లు అయింది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రవీంద్రనాథ్ రెడ్డిని మానసికంగా దెబ్బ కొట్టాలని కూటమి భావించింది. అందుకు తగ్గట్టుగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. దాదాపు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ద్వితీయ శ్రేణి నాయకులను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకుంది. అందులో కొంతవరకు సక్సెస్ అయింది. దీనిని జగన్ మేనమామ ఎలా తట్టుకుంటారో చూడాలి.