AP Elections 2024
AP Elections 2024: రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మండుతున్న ఎండలతో పాటు రాజకీయాలు సైతం సెగలు పుట్టిస్తున్నాయి. వైసిపి ఒంటరి పోరు చేస్తుండగా.. టిడిపి, బిజెపి, జనసేన కూటమి కట్టాయి. అయితే కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య విచిత్ర పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బీజేపీతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు అనుమానంగా ఉంది. కేవలం ఎన్నికల అవసరాల కోసమే పొత్తు పెట్టుకున్నట్లు.. అసలు ఆ పార్టీతో సంబంధం లేనట్లు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోంది. ఎక్కడైతే టిడిపికి అనుకూల బీజేపీ నాయకులు పోటీ చేస్తున్నారో అక్కడ మాత్రం వారికి సంపూర్ణ సహకారం అందుతోంది. మిగతా చోట్ల మాత్రం కనీసం బిజెపి జెండాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు.
టిడిపి అనుకూల మీడియా అయితే దాదాపు బిజెపిని పక్కన పెట్టింది. కేవలం పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబును పైకెత్తేలా ప్లాన్ చేస్తోంది. వారి వార్తలకే ప్రాధాన్యం ఇస్తోంది. పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి అభ్యర్థుల విషయంలోనే ఈ మీడియా కథనాలు, వార్తలు ప్రచురిస్తోంది. మిగతా వారి విషయంలో మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అటు ఎన్నికల ప్రచార సభల్లో సైతం చంద్రబాబుతో పాటు పవన్ ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ఫోటో అస్సలు కనిపించడం లేదు. ఆ మాటే వినిపించడం లేదు. ఇదెక్కడి పొత్తు ధర్మం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
కనీసం బిజెపి జెండా పట్టుకునేందుకు కూడా టిడిపి శ్రేణులు అంగీకరించడం లేదు. సభలు, సమావేశాల్లో కేవలం టిడిపి, జనసేన జెండాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ రెండు పార్టీలు కలిపి వందలాది జెండాలు ఉండగా.. ఒకటి రెండు బిజెపి జెండాలు దర్శనమిస్తున్నాయి. ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో అయితే బీజేపీ అనే పేరు తలుచుకునేందుకు కూడా టిడిపి ముందుకు రావడం లేదు. కేవలం తాము ఎన్నికల నిర్వహణ కోసమే బిజెపితో కలిశామని… తమకు బిజెపితో ఎటువంటి సంబంధం లేదని స్వయంగా టిడిపి నేతలే ముస్లిం ఓటర్ల దగ్గర మనసు విప్పి చెబుతున్నారు. అయితే ఈ తరహా పరిణామాలు చూసి సగటు బిజెపి అభిమాని బాధపడుతున్నాడు. కేవలం ఎన్నికలు సవ్యంగా జరగాలన్న కోణంలోనే తమతో పొత్తు పెట్టుకున్నారని.. కానీ పొత్తు ధర్మం పాటించడం లేదని.. మరోసారి ఏపీ ప్రజల్లో బిజెపి పట్ల చులకన భావం చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.