Kolikapudi Srinivasa Rao : టిడిపి( Telugu Desam Party) కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం బాగానే ఉంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి బాగాలేదు. అటువంటి వారికి పార్టీ హై కమాండ్ ఎప్పటికప్పుడే మందలిస్తూ వచ్చింది. చాలామంది తమ పనితీరును మార్చుకున్నారు. కానీ ఒకే ఒక ఎమ్మెల్యే మాత్రం తన తీరు మార్చుకోవడం లేదన్న విమర్శ వస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే అంటే? కృష్ణాజిల్లా పి గన్నవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలికపూడి శ్రీనివాసరావు. గెలిచిన నాటి నుంచి ఆయన అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల టిడిపి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన తీరు నచ్చక ఓ టిడిపి కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. కేవలం ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలితోనే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితుడు సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. దీంతో ఎమ్మెల్యేకు కొత్త వివాదం మెడకు చుట్టుకున్నట్టు అయ్యింది.
* ఉద్యమ నేపథ్యం
అయితే అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి శ్రీనివాసరావు( KohlikaPudi Srinivasa Rao) . ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అమరావతి రైతుల వాయిస్ బలంగా వినిపించారు. టీవీ డిబేట్లో ఎక్కువగా పాల్గొనేవారు. ఈ తరుణంలోనే ఓ టీవీ ఛానల్ అధినేత చంద్రబాబుకు సిఫార్సు చేసినట్లు అప్పట్లో ప్రచారం నడిచింది. మరోవైపు విజయవాడ పార్లమెంట్ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని శివనాథ్ సైతం కొలికపూడికి టికెట్ ఇప్పించడంలో క్రియాశీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వడం.. కొలికపూడి గెలవడం జరిగిపోయింది.
* తరచూ వివాదాలు
అయితే తరచూ వివాదాల్లో కూరుకుపోవడంతో టీడీపీలో( Telugu Desam Party) హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకో ఆయన టిడిపి శ్రేణులతో సమన్వయం చేసుకోలేకపోతున్నారు. అతను మాకు వద్దు అంటూ టిడిపి శ్రేణులు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపేలా పరిస్థితి వచ్చింది. ఒకానొక దశలో ఆయన పై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని మరో టాక్ ఉంది. అయితే కొలికపూడి శ్రీనివాసరావు నిజాయితీ కూడా ఆయనకు మైనస్ గా మారుతుంది. రిజర్వుడు నియోజకవర్గంగా ఉండడంతో మిగతా సామాజిక వర్గ నేతల పెత్తనానికి చెక్ పడడంతోనే.. ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది ఒక వాదనగా వినిపిస్తోంది.
* మంచి విద్యావేత్త
కొలికపూడి శ్రీనివాసరావు.. ప్రస్తుతం అధికార టిడిపి ఎమ్మెల్యే. అమరావతి రాజధాని( Amaravati capital ) ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. హైదరాబాదు నుంచి ఏకంగా అమరావతికి 300 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. 2001 నుంచి హైదరాబాదులో స్టడీ సర్కిల్ నడుపుతున్నారు. ఎంతోమంది అధికారులుగా స్థిరపడేలా కోచింగ్ ఇచ్చారు కొలికపూడి. సమాజం పట్ల విస్తృతమైన అవగాహన ఉన్న ఆయన.. ఎమ్మెల్యేగా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకం అవుతోంది. ఎందుకో ఆయన ఈ విషయంలో వివాదాలను ఏరి కోరి తెచ్చుకుంటున్నారు. అయితే ఆయన వ్యవహార శైలి కారణమా.. లేకుంటే ఇతరులు సృష్టిస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.