https://oktelugu.com/

MLA Kolikapudi Srinivasa Rao: రైతులను కుక్కలతో పోల్చిన టిడిపి ఎమ్మెల్యే.. వీడియో వైరల్!

కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు సొంత పార్టీతో పాటు మిగతా రెండు పార్టీల ఎమ్మెల్యేలకు కీలక సూచనలు ఇచ్చారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎటువంటి తప్పిదాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలే చంద్రబాబు ఆదేశాలను పాటించడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : October 4, 2024 / 11:16 AM IST

    MLA Kolikapudi Srinivasa Rao

    Follow us on

    MLA Kolikapudi Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహార శైలి టిడిపి హై కమాండ్ కు తలనొప్పిగా మారింది. ఒకటి పోతే ఒకటి వివాదాన్ని తెస్తూనే ఉన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన సొంత పార్టీ శ్రేణులతో పాటు ప్రజలపై కూడా నోరు పారేసుకుంటున్నారు. దీంతో పార్టీతో పాటు ప్రభుత్వం పై చెడ్డ పేరు వస్తోంది. ఆయన విషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక చంద్రబాబు సతమతమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సీన్ క్రియేట్ చేశారు. ఏకంగా యంత్రాలతో వెళ్లి ఓ వైసీపీ నేత ఇంటిని కూల్చివేతకు ప్రయత్నించారు. అటు తరువాత డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టేలా చేశారు. గంటల తరబడి పోలీస్స్టేషన్లో ఉండేలా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై పెద్ద విమర్శలు చెలరేగడంతో చంద్రబాబు పిలిచి మరీ క్లాస్ పీకారు. అయినా సరే ఆయన వైఖరిలో మార్పు రావడం లేదు. ఎమ్మెల్యే తీరు కారణంగా టిడిపి సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇది రాష్ట్రస్థాయిలో హాట్ టాపిక్ అయింది. ఓ సర్పంచ్ ను ఉద్దేశించి ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ కనిపిస్తే చెప్పుతో కొడతానంటూ అసభ్య పదజాలంతో దూషించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడంతో సర్పంచ్ కుటుంబం మనస్థాపానికి గురైంది. ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆసుపత్రిలో చేరారు. అక్కడితో ఆగని ఆయన ఆగడాలు మహిళలపై లైంగిక వేధింపుల వరకు ఆరోపణలు వచ్చాయి. ఏదైనా పనిమీద ఎమ్మెల్యే వద్దకు వెళ్తే లైంగికంగా వేధిస్తున్నారు అంటూ కొంతమంది ఆరోపణలు చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా చేస్తున్నారన్నది కొలికపూడి ఆరోపణ. ఐఏఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఆయన ఇప్పటివరకు క్రమశిక్షణతోనే ఉండేవారు. దీంతో ఆయనపై వస్తున్న ఆరోపణల్లో నిజం ఎంత అన్న చర్చ కూడా ఉంది.

    * రైతులను కించపరిచేలా
    తాజాగా ఎమ్మెల్యే కొలికపూడి మరో వివాదంలో చిక్కుకున్నారు. రైతులను కుక్కలతో పోల్చారు. కుక్కలకైనా విశ్వాసం ఉంటుంది కానీ.. రైతులకు అది కూడా ఉండదనే విధంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో కొలికపూడి పై సొంత పార్టీలోనే చర్చ నడుస్తోంది. పార్టీ శ్రేణుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే టిడిపి శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఎమ్మెల్యే స్థానంలో ఇన్చార్జిని నియమించాలని డిమాండ్ చేస్తూ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి కూడా వెళ్ళింది. అయినా సరే ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిలో ఎటువంటి మార్పు రాకపోవడం విశేషం.

    * ఇన్చార్జి నియామకం?
    అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టు ఉంది పరిస్థితి. ఇప్పటివరకు సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకించాయి. ఇప్పుడు ఏకంగా రైతులను దూషిస్తూ మాట్లాడడం రాష్ట్రస్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. అందుకే కొలికపూడిని మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆయన స్థానంలో కొత్త ఇన్చార్జిని నియమిస్తారని ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. ముందుగా క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు పరుస్తారని.. సంతృప్తికరంగా సమాచారం లేకుంటే.. కఠిన చర్యలకు ఉపక్రమిస్తారని తెలుస్తోంది.