Balakrishna: బాలయ్య ఎందుకో అభిమానులు దగ్గరకు వస్తే తట్టుకోలేరు. చెంప చెల్లుమనిపిస్తారు. ఉన్నట్టుండి వారిపై రెచ్చిపోతారు. చెడామడా తిట్టిపోస్తారు. చాలాసార్లు ఇది జరిగింది. ఇప్పుడు తాజాగా రిపీట్ అయ్యింది. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నుంచి బాలయ్య ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హెలిక్యాప్టర్లో ల్యాండ్ అయ్యారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఆయన పైకి దూసుకెళ్లారు. సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో బాలయ్యకు ఒక్కసారిగా కోపం వచ్చింది. ఒక అభిమాని చెంప చెల్లుమనిపించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అభిమానులపై చేయి చేసుకోవడం ఇదే తొలిసారి కాదు. చాలాసార్లు ఇదే మాదిరిగా బాలయ్య వ్యవహరించారు. విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి అభిమానులను దూరం చేసుకున్నారు.
బాలయ్య బోళా మనిషి అని పేరుంది. ఒక్కోసారి ఎంతో చలాకీగా ఉంటారు. అభిమానులతో ఇట్టే కలిసి పోతారు. అభిమానులు కష్టంలో ఉంటే చలించిపోతారు. వారికి సాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. తోటి నటీనటులు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతో ఇష్టపడతారు. ఆయన వ్యవహార శైలి బాగుంటుందని కితాబిస్తారు. కానీ ఉన్నట్టుండి అభిమానుల విషయంలో బాలకృష్ణ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతుంది. ఎంతో అభిమానంతో చూడడానికి వస్తే ఇలా చేయి చేసుకోవడం ఏమిటని నందమూరి అభిమానులు బాధపడుతుంటారు. అయితే ఎన్నికల సమయంలో ఇలా చేయి చేసుకోవడం ఏమిటని టిడిపి శ్రేణులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. చేజేతులా ప్రత్యర్థులకు ప్రచార అస్త్రం ఇస్తున్నారని బాలకృష్ణ తీరుపై మండిపడుతున్నాయి.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లలో బాలకృష్ణ ఒకరు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర పేరుతో రెండు రోజులపాటు బాలయ్య బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. హిందూపురంలో కూడా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించలేదు. అయితే ఈసారి ఎలాగైనా బాలకృష్ణను ఓడించాలని వైసీపీ కృత నిశ్చయంతో ఉంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి కాచుకుని కూర్చున్నారు. ఎలాగైనా బాలకృష్ణను ఓడిస్తానని శపధం పెట్టుకున్నారు. ఇటువంటి సమయంలో అభిమానులను దూరం చేసుకోవడం బాలయ్యకు తగదని.. ఇంకా ఎన్నాళ్లు అభిమానులు చెంప దెబ్బలు తినాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ పెడుతున్నారు. పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.