TDP MLA Aditi Gajapathi Raju: టిడిపి కూటమిలో( TDP Alliance ) కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ పరంగా పరవాలేకున్నా.. ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వివిధ సర్వేల్లో కూడా ఎమ్మెల్యేలు వెనుకబడ్డారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో చాలా నియోజకవర్గాల్లో టిడిపి నేతలు, కార్యకర్తల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడే అవి బయట పడుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే పై సొంత పార్టీ కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద బ్యానర్ ప్రదర్శించి ఎమ్మెల్యే పనితీరుపై ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీనిని వైరల్ చేస్తోంది.
అశోక్ గజపతిరాజు కుమార్తెగా..
ప్రస్తుతం విజయనగరం ఎమ్మెల్యేగా అదితి గజపతిరాజు(Aditi gajapati Raju) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె. మొన్నటి ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు అశోక్ గజపతిరాజు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కుమార్తె అదితి గజపతిరాజు టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆమె డిప్యూటీ స్పీకర్ గా ఉన్న కోలగట్ల వీరభద్ర స్వామి పై అత్యధిక మెజారిటీతో గెలిచారు. అయితే విజయనగరం టిడిపిలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయి. ఈ తరుణంలో సొంత పార్టీ కార్యకర్త ఒకరు కలెక్టరేట్ గ్రీవెన్స్ కు వచ్చి ఆందోళన చేశారు. ఏడాది క్రితం ఎంతో నమ్మకంతో గెలిపించుకున్నామని.. కానీ ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కనిపించడం లేదంటూ ఎద్దేవా చేస్తూ సదరు కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రకాల హామీలు ఇచ్చారని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయారని వాపోయారు. ప్రస్తుతం టిడిపి కార్యకర్త నిరసన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పార్టీలో విభేదాలతోనే?
కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అభివృద్ధి( developments ) పనులకు సంబంధించి నిధులు భారీగా కేటాయింపులు జరుగుతున్నాయి. పనులు కూడా జరుగుతున్నాయి. అయితే సంక్షేమ పథకాలతో పోల్చితే అభివృద్ధి పనులు ముందంజలో ఉన్నాయి. విజయనగరం నగరపాలక సంస్థలో జోరుగా పనులు అయితే సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తండ్రికి మాదిరిగా అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్న మంచి పేరు కూడా ఉంది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాయి. దాని ఫలితంగానే సొంత పార్టీ కార్యకర్త ఇలా వీధిలోకి వచ్చి నిరసన తెలిపినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా సొంత పార్టీ కార్యకర్త ఇలా కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగడం నిజంగా సంచలనమే. అయితే ఆయన ప్రదర్శిస్తున్న బ్యానర్ లో ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు బదులు.. విజయలక్ష్మి అని ఉండడం విశేషం.
మా పార్టీ ఎమ్మెల్యే ఫెయిల్!
ఏడాదిలో నిధులు లేవు, అభివృధి లేదు
– విజయనగరం టిడిపి కార్యకర్తలు pic.twitter.com/0cEgUmaJAD— Anitha Reddy (@Anithareddyatp) July 8, 2025