TDP Mahanadu : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ఆస్తి. దేశంలో ఏ పార్టీకి లేనంత సంస్థాగత నిర్మాణం టీడీపీ సొంతం. నాలుగు దశాబ్దాల కిందట ఏర్పాటైన తెలుగుదేశం పార్టీకి గెలుపోటములు సహజం. పడిపోయిన ప్రతిసారి ఆ పార్టీ లేచింది. అధికారం చేపట్టింది. దీని వెనుక ఉన్నది వన్ అండ్ ఓన్లీ కార్యకర్తలు. అంతలా ఉంటుంది పార్టీలో కార్యకర్తల పోరాటం. దానిని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు. కడపలో ఈరోజు మహానాడు ప్రారంభమైంది. చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు. తెలుగుదేశం గొప్పతనాన్ని, కార్యకర్తల పోరాట పటిమను గుర్తుచేశారు. పీక కోస్తున్నా జై తెలుగుదేశం అన్న తోట చంద్రయ్య అనే కార్యకర్త పోరాట పటిమను, పార్టీ పట్ల అతడికి ఉన్న ఆపేక్షను గుర్తుచేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రయ్యలాంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. అందరూ తోట చంద్రయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీంతో మహానాడు సభలో తోట చంద్రయ్య గురంచి చర్చ ప్రారంభమైంది.
Also Read : ‘తూర్పు’లో కట్టుదాటుతున్న తమ్ముళ్లు!
జరిగింది ఇది..
2022 జనవరి 13న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గండ్లపాడుకు చెందిన తోట చంద్రయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఈయన టీడీపీ ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. వైసీపీ నేతలు చంద్రయ్య ఇంటి సమీపంలోనే పట్టపగలే హతమార్చారు. టీడీపీ క్రియాశీలకంగా ఉండే చంద్రయ్యను పలుమార్లు వైసీపీ నేతలు హెచ్చరించారు. తమ దారిలోకి రాకపోయేసరికి హతమార్చేందుకు ప్రణాళిక రూపొందించారు. అందరూ చూస్తుండగానే పట్టపగలు దారుణంగా హత్య చేశారు. కత్తులతో పీక కోశారు. చివరి సారిగా జై జగన్ అనాలని డిమాండ్ చేశారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అనేసరికి కత్తులతో గొంతు కోశారు. అంతటి రక్తస్రావంలో కూడా చంద్రయ్య జై టీడీపీ అంటూ నేలకొరిగాడు. దానినే గుర్తుచేశారు సీఎం చంద్రబాబు. చంద్రయ్యలాంటి కార్యకర్తను కోల్పోవడం బాధగా ఉందని చెప్పారు. అయినా ఆయన నిరంతరం మన మనస్సులో బతికి ఉంటాడని చెప్పారు.
చంద్రయ్య కుటుంబానికి అండ..
మరోవైపు వైసీపీ నేతల చేతుల్లో హతమైన చంద్రయ్య కుటుంబానికి అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రాగానే చంద్రయ్య కుమారుడుకు ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. అటు చంద్రయ్య హత్యకేసును సీఐడీకి అప్పగించింది. గత ఏడాది జూలైలోనే సీఐడీకి అప్పగించగా.. కేసు విచారణకు అధికారులు పెద్దగా సహకరించలేదు. దీంతో కేసు దర్యాప్త మరింత వేగవంతం అయ్యేలా ప్రభుత్వ స్పెషెల్ కౌన్సిల్ ను ఏర్పాటుచేసింది. ప్రత్యేక న్యాయవాదిని సైతం నియమించింది. ఇప్పుడు మహానాడులో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చంద్రయ్య ప్రస్తావన చేయడం విశేషం. ఇక టీడీపీ పని అయిపోయిందని చాలామంది మేధావుల ముసుగులో మాట్లాడారని.. అటువంటి వారంతా ఇప్పుడు టీవీల్లో ఈ ప్రభంజనం చూస్తుంటారని ఎద్దేవా చేశారు. అచంద్రార్కం తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల్లో ఉండిపోతుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు.