BJP vs TDP:ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ తెరవెనుక ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బీజేపీతో పొత్తును పునరుద్ధరించుకోవడంపై మాత్రం ఆశలన్నీ కోల్పోయినట్టుగా కనిపిస్తోంది.
రాష్ట్రంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ‘నాన్ సీరియస్ ’ పోరాటం చేసిన టీడీపీకి వచ్చేసారి ఒంటరిగా గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు బీజేపీ రోజురోజుకు బలోపేతం అవుతోంది. జగన్ సర్కార్ పై పోరాటాలు చేస్తోంది.
అయితే బీజేపీతో టీడీపీ ఎంత దగ్గర అవుదామని అనుకుంటున్నా.. రెండు పార్టీల మధ్య మాత్రం ఆ సయోధ్య కుదరడం లేదు. ఎవరో ఒకరు చెడగొడుతూనే ఉన్నారు.తాజాగా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు. ‘వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ నిర్వహిస్తున్న ప్రజా ఆగ్రహ సభను పయ్యావుల ‘జగన్ అనుగ్రహ సభ’గా అభివర్ణించి బీజేపీ గాలి తీసేశారు. ఏపీలో బీజేపీ పూర్తిగా జగన్ నీడలో , అతడి నెట్ వర్క్ లో భాగంగా పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీని ‘భారతీయ జగన్ పార్టీ’ అని అభివర్ణించారు. రాష్ట్ర బీజేపీ నాయకులకు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్ ప్రభుత్వ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు.
ఇక ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ దాడులు చేసినప్పుడు కూడా ఇదే బీజేపీ నేతలు స్పందించారు. కేంద్ర పథకాలను జగన్ తన సొంత పథకాలుగా మార్చి నిధులు మళ్లించినప్పుడు కూడా బీజేపీ నోరు మెదకపోవడం గమనార్హం.
ఈ క్రమంలోనే జగన్ దుష్పరిపాలనపై బీజేపీ మౌనంగా ఉందని అర్థమవుతోందని పయ్యావుల లాంటి నేతలు ఆడిపోసుకున్నారు. జగన్ ప్రభుత్వం చేతిలో రాజకీయ ప్రత్యర్థుల వేటపై కేంద్రంలోని సీబీఐ, ఈడీలో దమ్ముంటే బీజేపీ విచారణ చేయాలని పయ్యావుల డిమాండ్ చేయడం విశేషం.
దీన్ని బట్టి ఇక ఏపీలో బీజేపీతో పొత్తులుండవని.. ఆ పార్టీతో పోరాటమేనని టీడీపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే బీజేపీపై తొలిసారి విమర్శల దాడి ఎక్కుపెట్టినట్టు తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కొన్నట్టే బీజేపీని ఎదుర్కోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది.