Rajya Sabha MP Election : రాజ్యసభకు మెగా, నందమూరి వారసులు.. ఏపీ సీఎం సంచలన నిర్ణయం.. మూడు స్థానాలకు అభ్యర్థుల ఖరారు! ?

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు అధికార టీడీపీ కూటమి సిద్ధమవుతోంది. మరోవైపు త్వరలోనే రాజ్యసభ ఎంపీల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. దీనిపై కూడా టీడీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 21, 2024 1:04 pm

CM Chandrababu

Follow us on

Rajya Sabha MP Election : ఆంధ్రప్రదేశ్‌లో ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. గతంలో ఎన్నడూ రానంతంగా కూటమికి 164 సీట్లు వచ్చాయి. ఇక కేంద్రంలో కూడా టీడీపీ కీలకంగా మారింది. టీడీపీ మద్దతులోనే ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటు ఏపీలో, అటు కేంద్రంలో టీడీపీకి ఇప్పుడు మంచి ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నేతలు ఇప్పుడు అధికార పార్టీవైపు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు పార్టీని వీడారు. పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఏపీ నుంచి మూడు రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వీటికి త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయకుడు రాజ్యసభ అభ్యర్థుల ఎన్నికకు కసరత్తు ప్రారంభించారు. ముగ్గురు అభ్యర్థులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈమేరకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్, బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో మూడు రాజ్యసభ పదవులకు మూడు పార్టీల నుంచి ఒక్కక్కరినీ ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈమేరకు అభ్యర్థుల ఎంపిక ప్రకక్రియ కూడా కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.

రాజీనామా చేసింది వీరే..
ఇదిలా ఉంటే.. వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య తమ రాజ్యసభ పదవులకు ఇటీవలే రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి, మస్తాన్‌రావు టీడీపీలో చేరారు. వీరిని తిరిగి రాజ్యసభకు పంపుతామనే హామీ మేరకు వారు పార్టీని వీడారని సమాచారం. కానీ, ముగ్గురూ బీసీలే కావడంతో ఇప్పుడు వారిని పక్కన పెట్టి.. సీఎం చంద్రబాబు కొత్తవారిని ఎంపిక చేశారని సమాచారం. కూటమి నుంచి ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉండడంతో అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీలో కూటమికి 164 ఎమ్మెల్యేలు ఉన్నారు. మూడు స్థానాలు గెలవడం ఈజీ. ఈ నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేయడమే మిగిలింది.

వీరు పేర్లు ఖరారు?
మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురిని ఎంపిక చేసినట్లు కూటమి నేతలు చెబుతున్నారు. జనసేన నుంచి నాగబాబు పేరు దాదాపు ఖరారైంది. చిరంజీవి తరహాలో నాగబాబును రాజ్యసభకు పంపాలని నిర్ణయించారని తెలిసింది. ఏదైనా అనూహ్యం జరిగితే తప్ప నాగబాబు పేరు ఫైనల్‌ అని చెబుతున్నారు.

– ఇక టీడీపీ నుంచి రాజ్యసభ టికెట్‌ను చాలా మంది ఆశిస్తున్నారు. రాజీనామా చేసిన మోపిదేవి, మస్తాన్‌రావుతోపాటు పార్టీ సీనియర్‌ నేతలు రేసులో ఉన్నారు. అయితే తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్న చంద్రబాబు టీడీపీ తరఫున రాజ్యసభకు టీడీపీ నేతను పంపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నందుమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇదే సమయంలో ఏపీ నుంచి గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్‌రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మోపిదేవి ఉమా మహేశ్వరరావు కూడా ఎంపీ పదవి ఆశిస్తున్నారు. బీసీకి టికెట్‌ ఇవ్వాల్సి వస్తే.. కొత్తవారిని కాకుండా మస్తాన్‌రావుకే టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

– ఇక బీజేపీ నుంచి కూడా ఒకరిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. బీజేపీకి సీటు ఖాయమైతే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి టికెట్‌ దక్కే ఛాన్స్‌ ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. వైసీపీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ కూడా పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూడింటిలో రెండు టీడీపీ ఆశిస్తోంది. మరో రాజీనామా తర్వాత ఆ స్థానం బీజేపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉంది.