TDP Janasena First List: ఏపీలో ఎన్నికలకు సంబంధించి శనివారం టిడిపి , జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదట 118 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ.. టిడిపి 94.. సేన ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల వివరాలను వెల్లడించాయి. మిగతా 19 స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సీట్ల కేటాయింపునకు సంబంధించి సామాజిక సమతూకం పాటించామని అటు టిడిపి, ఇటు జనసేన ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. టిడిపి ప్రకటించిన 94 స్థానాలలో 21 స్థానాలు కమ్మ సామాజిక వర్గం వరకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక సీటు ఇచ్చారు. వెనుకబడిన తరగతులకు 18, దళితులకు 20, కాపులకు ఏడు సీట్లు కేటాయించారు.. ఈ సీట్ల కేటాయింపు పట్ల పలు సామాజిక వర్గాలు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.. ఇక 2014 నుంచి 2019 వరకు టిడిపి ఏపీలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన తరగతులకు చెందిన ఒకరిని కూడా రాజ్యసభకు పంపించలేదు. చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే రాజ్యసభకు పంపారనే విమర్శలు ఉన్నాయి..
జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలు దక్కాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టిడిపి 94 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తే.. పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ స్థానాలకు గానూ కేవలం ఐదు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించారు. ఆ ఐదు స్థానాల్లో తన సొంత కాపు సామాజిక వర్గం వారికి అంతంతమాత్రంగానే టికెట్లు కేటాయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో 130 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. జనసేన పోటీ చేయడం ద్వారా ఒక్కసారిగా ఏపీలో అధికారాలు తారుమారయ్యాయి. కానీ ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి 130 నుంచి 24 స్థానాలకు జనసేన పడిపోయింది. ప్రస్తుతం జనసేన పోటీ చేస్తున్న 24 స్థానాల్లో ఎంతమంది కాపు సామాజిక వర్గం వారికి టికెట్లు కేటాయించారనేది తేలాల్సి ఉంది. మరో వైపు టికెట్లకు కేటాయింపు విషయంలో పవన్ కళ్యాణ్ ఒక జాబితా అంటూ విడుదల చేయలేదు. కేవలం అప్పటికప్పుడు వైట్ పేపర్ మీద ఐదుగురు అభ్యర్థుల పేర్లు రాసి చంద్రబాబుతో సంయుక్తంగా దానిని విలేకరుల ఎదుట ఆవిష్కరించారు. చంద్రబాబు మాత్రం తన పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాను పకడ్బందీగా విడుదల చేయడం విశేషం.
అయితే ఈ రెండు పార్టీలు కూడా మెరుగైన స్థానాలు కేటాయించకపోవడంతో మైనారిటీలు ఆగ్రహంగా ఉన్నారు. మరోవైపు తమ సామాజిక వర్గానికి గొప్పగా సీట్లు దక్కకపోవడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సొంత సామాజిక వర్గానికి న్యాయం దక్కేది ఎప్పుడని వారు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత చేగొండి హరి రామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు సుదీర్ఘ లేఖ రాశారు. పలు అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ టికెట్లు కేటాయింపును చూసి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.