TDP – Janasena alliance : ఎవరైనా రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసేది అధికారం కోసమే. ఈ విషయాన్ని నేరుగా చెబితే ఎవరూ ఒప్పుకోరు. పైగా సమాజ సేవ, పేద ప్రజల సంక్షేమం, సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం అని వీరలెవల్లో లెక్చర్లిస్తారు. ఎన్నికలు వస్తే గాని రాజకీయ పార్టీల అసలు రూపం అర్థం కాదు. ఇప్పుడు మనం చెప్పుకోపోయేది కూడా అలాంటిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ అనే నటుడు జనసేన అనే పార్టీని ప్రారంభించారు. పార్టీ ప్రారంభించిన కొద్ది రోజులకే ఏపీలో ఎన్నికలు రావడంతో అక్కడ చంద్రబాబు బిజెపి కూటమికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎన్నో ఆశలతో జనసేన పార్టీలో చేరిన నాయకులకు పవన్ కళ్యాణ్ తీసుకున్న తొలి నిర్ణయం చాలా ఇబ్బంది అనిపించింది. సరే విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ మాటను అప్పటి నాయకులు జవదాటలేదు. టిడిపి కి మద్దతు ప్రకటించారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో టిడిపి బిజెపి కూటమి విజయం సాధించింది. ఏ లక్ష్యాలకు అనుగుణంగా జనసేన పార్టీ స్థాపించారో.. వాటి గురించి అప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తే తిరస్కరించారు. చివరికి రాజధానికి భూములు ఇచ్చిన రైతులను కూడా విస్మరించారు. వారి సమస్యల పట్ల పవన్ కళ్యాణ్ స్పందించడంతో టీడీపీ, జనసేన మధ్య వివాదం మొదలైంది. అది చివరికి వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే స్థాయికి దిగజారింది. ఈ మొదటిది గుణపాఠం అనుకొని జనసేన నాయకులు సర్ది చెప్పుకున్నారు.
ఇక 2019 ఎన్నికల్లో జనసేన కమ్యూనిస్టు పార్టీ, బహుజన్ సమాజ్వాది పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఈసారి ఒక్క సీటు గెలుచుకొని ఆభాసుపాలైంది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. అప్పుడు కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పోరాట పటిమ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.. ప్రజల్లో ఉంటే తిరుగు లేదని.. సారి కాకపోయినా మరొక సారైనా అధికారంలోకి వస్తామని సర్ది చెప్పుకున్నారు.. అంతేకాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తుంటే సంబరపడ్డారు. ప్రజల్లో ఉంటున్నామని గర్వపడ్డారు. కానీ ఎప్పుడైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టు కావడం.. రాజమండ్రి జైలులో విచారణ ఖైదీగా ఉండటం.. ఆయనకు పవన్ కళ్యాణ్ మద్దతు పలకడం.. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని చెప్పటంతో జనసేన నాయకులు ఒక్కసారిగా డీలా పడ్డారు. అసలు తమ నాయకుడు ఏం చేస్తున్నాడో అర్థం కాక వేదనలో కూరుకు పోయారు.
ఇక నాయకుడి మాటను ఎలాగూ జవదట లేరు కాబట్టి.. పవన్ కళ్యాణ్ నిర్ణయానికి తలవంచారు. 175 సీట్లు ఉన్న ఏపీలో ఎన్ని జనసేనకు కేటాయిస్తారు అనేది ఇప్పటికీ తేలలేదు. ఎప్పటికీ తేలుతుందో ఇప్పటికైతే అంతు పట్టడం లేదు. మార్చి 14 నాటికి పార్టీ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో పార్టీ ఏం చేసింది అనే ప్రశ్నకు నాయకుల వద్ద సమాధానం లేదు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను అంటిపెట్టుకొని ఉన్న నాయకులకు సీట్లు దక్కుతాయో లేదో తెలియదు.. అంటే స్థూలంగా సీట్లు కేటాయించే విషయం చంద్రబాబు చేతుల్లో ఉంది. ఆయన అనుకూల మీడియా జనసేన 25 సీట్లు మాత్రమే కోరుతోంది అని రాస్తోంది. కనీసం ఈ విషయం పవన్ కళ్యాణ్ కైనా తెలుసో లేదో.. మరి ఇలా 25 సీట్లకే జనసేన పార్టీని పరిమితం చేస్తే.. ఈసారి కూడా ఆ పార్టీ కార్యకర్తలు వైసిపి నాయకులు ఆరోపిస్తున్నట్టుగా జెండా మోసే కూలీలు గానే ఉండిపోవాలా.. పవన్ కళ్యాణ్ పల్లకి మోసే బోయిగా మాత్రమే మిగిలిపోవాలా? ఏమో ఈ ప్రశ్నలకు సమాధానం లభించడం కష్టమేమో.. ఏదిఏమైనాప్పటికీ జనసేన నాయకుల్లో రోజురోజుకు ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతోంది. మరి ఈ ఆత్మ విశ్వాసాన్ని పెంచే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ భుజాలకి ఎత్తుకుంటారా.. ఉంటే ఉండండి పోతే పొండి అంటారా?