YCP Land Grab: రెవెన్యూ సమస్యలపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. వైసిపి హయాంలో భూ అక్రమాలు,కబ్జాలు జరిగాయని భావిస్తోంది.ముఖ్యంగా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా దోచుకున్నారని.. ప్రైవేటు భూములను సైతం బలవంతంగా లాక్కున్నారన్న ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కీలకమైన ఫైళ్లు దగ్ధమయ్యాయి. వీటి వెనుక ఉద్దేశపూర్వక చర్యలు ఉన్నాయని అనుమానాలు ఉన్నాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే వీటిని దహనం చేశారు. దీని వెనుక మాజీ మంత్రి హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన భూకబ్జాలకు సంబంధించిన ఫైళ్లు కావడం, ప్రభుత్వం మారడంతో ఈ దుశ్చర్యకు దిగారని ఆరోపణలు బలంగా వినిపించాయి. అందుకే ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలతో పాటు రెవెన్యూపరమైన అంశాలపై దృష్టి పెట్టింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా అన్ని జిల్లాల్లో పర్యటించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివాదాస్పద భూములను పరిశీలించారు. అందుకే సెప్టెంబర్ ఒకటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు.
* ఫ్రీ హోల్డ్ లోకి ఆ భూములు
వైసిపి హయాంలో ఓ జీవో వచ్చింది.దళితులకు,వెనుకబడిన వర్గాలకు అందించే డీ పట్టా భూములు.. 20 ఏళ్లు దాటితే జిరాయితీగా మార్చుకునే హక్కును కల్పించారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ లో చేర్చి.. నిషేధిత భూముల జాబితా నుంచి తప్పించారు. ఇందుకుగాను ప్రత్యేక జీవో జారీ చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల భూములు డి పట్టా నుంచి జిరాయితీగా మారాయి. అయితే ఈ జీవో వెనుక భారీ మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున భూములను కొట్టేసేందుకే ఈ జీవో జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
* ముందుగానే ఒప్పందం
విజయనగరం జిల్లా భోగాపురం లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఆ జిల్లాలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ జీవో జారీ కి ముందే ఆ భూ యజమానులతో ఒప్పందం చేసుకున్నారు. కోట్లాది రూపాయల భూములకు లక్షల రూపాయలు చెల్లించి కైవసం చేసుకోవాలని భావించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత.. ఆ భూములను తమ పేరిట మార్చుకున్నారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 ఎకరాల వరకు భూములు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయ్యాయి.
* జీవో తర్వాత రిజిస్ట్రేషన్లు
రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఈ జీవో వచ్చిన తర్వాత శరవేగంగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే మోసపోయామని భావించిన అసైన్డ్ భూమి యజమానులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ప్రభుత్వం మూడు నెలల పాటు ఈ ఫ్రీ హోల్డ్ జీవోను నిలిపివేసింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ముందుగానే ఒప్పంద పత్రం రాసుకున్న వైసీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కేవలం వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికేనని తెలుస్తోంది. మరోవైపు రెవెన్యూ సమస్యల సైతం పరిష్కారం దిశగా అడుగులు పడే అవకాశం ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Tdp is a big sketch to expose ycp land grab
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com